TS Election Results 2023: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత దిశగా కొనసాగుతోంది. దీంతో హై కమాండ్ అప్రమత్తమయ్యింది. ముందస్తు చర్యలు చేపట్టింది. లెక్కింపు ప్రక్రియ పూర్తికాగానే విజేతలను హైదరాబాద్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తుంది. ఒక్కో అభ్యర్థికి ఒక్కో పరిశీలకుడిని నియమించింది. మొత్తం సీఎల్పీ కార్యకలాపాల ఇన్చార్జిగా ట్రబుల్ షూటర్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను నియమించింది. మరోవైపు ఢిల్లీ నుంచి కీలక నాయకులను కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణకు పంపించింది.
ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ అభ్యర్థులకు టచ్లోకి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ పార్టీ కీలక నేత డీకే శివకుమార్ ప్రకటించడం సంచలనం రేకెత్తించింది. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ నేతలు కీలక సమావేశం ఏర్పాటు చేశారు. శనివారం రాత్రికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులను హైదరాబాద్ కు రప్పించాలని చూశారు. కానీ వ్యూహం మారింది. ఆదివారం మధ్యాహ్ననికి ఫలితాలు పూర్తిస్థాయిలో వెల్లడయ్యాక కాంగ్రెస్ పార్టీ విజేతలను హైదరాబాద్ తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు.
అభ్యర్థులు ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు కౌంటింగ్ కేంద్రంలో ఉండి జాగ్రత్తగా పరిశీలించాలని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఆదేశించింది. లెక్కింపు లో అక్రమాలు జరగకుండా అభ్యర్థులు గట్టి నిఘా పెట్టాలని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆదేశాలు ఇచ్చారు. మొత్తం బాధ్యతలను డీకే శివకుమార్ పై పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఫలితాలు అనంతరం తీసుకునే చర్లపై పర్యవేక్షణకు హైకమాండ్ చిదంబరం, సుశీల్ కుమార్ షిండే, సూర్జెవాలను నియమించింది. ఆదివారం మధ్యాహ్నం కి వారు హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు కాంగ్రెస్ శాసనసభ పక్షం కార్యకలాపాల పరిశీలకులుగా డీకే శివకుమార్, కేజీ జార్జ్,అజయ్ కుమార్, దీపా దాస్ మున్షి, మురళీధరన్ లను పార్టీ నియమించింది. రాష్ట్రంలోని మొత్తం 49 కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఏఐసిసి పరిశీలకులు వెళ్ళనున్నారు. ఒక్కో అభ్యర్థికి ఒక్కో పరిశీలకుడిని నియమించింది హై కమాండ్. మొత్తానికైతే అనుకూల ఫలితాలు వస్తున్న దృష్ట్యా కాంగ్రెస్ హై కమాండ్ జాగ్రత్త పడింది.