Congress: కర్ణాటకలో సాధించిన విజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ శక్తిని కూడ తీసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించారు. అవకాశం దొరికినప్పుడల్లా మోదీ ప్రభుత్వం మీద విశ్లేషణాత్మక విమర్శలు చేస్తున్నారు. పప్పు అనే పిలిచిన నోటితోనే భవిష్యత్తు ప్రధాని అని చెప్పుకునేలా చేస్తున్నారు. ఇప్పటికే హర్యానా రాష్ట్రంలో ట్రక్కు ద్వారా ప్రయాణించి జాతీయ మీడియాను మొత్తం తన వైపు ఫోకస్ చేసుకొనేలా చేశారు. అంతేకాదు అమెరికాలో పర్యటిస్తున్న నేపథ్యంలో అక్కడ తెలంగాణ యువకుడి కారులో వాషింగ్టన్ మొత్తం తిరిగేసారు. ఆ మధ్య హర్యానా లోనూ ఇదే విధానాన్ని అవలంబించారు.
సత్తా చాటాలని
త్వరలో తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్ రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తామంటూ షెడ్యూల్ కూడా దాదాపు విడుదల చేసింది. ఈ క్రమంలో చతిస్గడ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ తెగ ప్రయత్నిస్తోంది.. కర్ణాటక ఇచ్చిన విజయంతో మిగతా రాష్ట్రల్లోనూ సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తీరుగమన దశలో ఉంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతుండడంతో.. బిజెపి, భారత రాష్ట్ర సమితి నుంచి నాయకులను చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది.
ఉద్దేశం అదే
ఈ చేరికల ప్రధాన ఉద్దేశం భారత రాష్ట్ర సమితితో ముఖాముఖిగా తలపడే స్థానాల సంఖ్య పెంచుకోవడమే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గాల వారిగా కాంగ్రెస్ పార్టీ బలం పైన ఎప్పటికప్పుడు అధిష్టానం ఆధ్వర్యంలోని సర్వే సంస్థలు సర్వే నిర్వహిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో 60 నుంచి 70 అసెంబ్లీ స్థానాల్లో పోటీ కాంగ్రెస్ పార్టీ, భారత రాష్ట్ర సమితి మధ్య ఉంటుందని సర్వే సంస్థలు చెబుతున్నాయి. నియోజకవర్గ స్థాయిలో ప్రభావం చూపే నాయకులను కాంగ్రెస్ లో చేర్చుకుంటే ముఖాముఖి పోటీ మరో 30 నియోజకవర్గాలకు విస్తరణకు ఆస్కారం ఉంటుందని ఆ సర్వే సంస్థలు నివేదికల్లో వెల్లడించినట్టు ప్రచారం జరుగుతోంది. ముఖాముఖి పోటీ జరిగే స్థానాల సంఖ్య పెరిగే కొద్దీ దాని ప్రభావం ఇతర నియోజకవర్గాల పైన పడుతుందని, రాష్ట్రం యూనిట్ గా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ మళ్ళుతుందని అధిష్టానం అంచనా వేస్తోంది.. ఆ దిశగా వ్యూహాలు కూడా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో చేరికల ప్రక్రియను అధిష్టానం మరింత వేగవంతం చేసినట్టు సమాచారం. కాంగ్రెస్ లో చేరెందుకు ఆసక్తి చూపుతున్న బిజెపి, భారత రాష్ట్ర సమితి అసంతృప్తి నేతలతో నేరుగా అధిష్టానమే రంగంలోకి దిగి చర్చలు జరుపుతోంది. ఇక ఈ చేరిక సంబంధించి గత శనివారం, తాజాగా మంగళవారం నాడూ బెంగళూరు వెళ్ళిన టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఇతర ముఖ్య నాయకులతో చర్చలు జరిపారు. వారు చెప్పిన సమాచారం ప్రకారం జూన్ నెలాఖరులోగా బిజెపి , భారత రాష్ట్ర సమితి నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరుతారని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
నేతల మధ్య ఐక్యత లేదు
రాష్ట్రంలో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో సానుకూలత ఉన్నప్పటికీ నేతల ఐక్యత లేదని వివిధ సర్వే సంస్థలు అధిష్టానానికి విన్నవించాయి. ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీని పరిగణలోకి తీసుకోకపోవడానికి ఇది కూడా ఒక ప్రధాన అడ్డంకిగా మారిందన్న భావనకు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్య నాయకులు ఐకమత్యంగా ఉన్నారన్న సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అందరితో బస్సుయాత్ర నిర్వహించేందుకు అధిష్టానం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క నిర్వహిస్తున్న పాదయాత్ర ఈ నెల చివర లేదా జూలై మొదటి వారంలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే టిపిసిసి కార్యవర్గ విస్తరణ, ఇతర అంశాలనూ పూర్తి చేసి జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో ఈ బస్సు యాత్ర తలపెట్టే ఆలోచన కాంగ్రెస్ నాయకత్వం చేస్తోంది. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఇతర నేతలు ఈ బస్సు యాత్రలో పాల్గొంటారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.