
సీలింగ్ ఫ్యాన్ అయినా.. టేబుల్ ఫ్యాన్ అయినా.. లోపల వైరింగ్ దెబ్బతింటే ఖతమే. ఫ్యాన్ తిరగడం ఆగిపోద్ది. గాలి రావడం బందైపోద్ది. ఆ తర్వాత ఇంకేముంటుందీ? ఉక్కపోత తీవ్రతను బట్టి టార్చర్ అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు.. బెజవాడలో వైసీపీ పరిస్థితి కూడా ఇలానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైరింగ్ లా కలిసికట్టుగా ఉండి వైసీపీ ఫ్యాన్ ను రివ్వున తిరిగేలా చేయాల్సిన నేతలు.. విడివిడిగా ఉంటూ.. వీకైపోతున్నారని ఆవేదన చెందుతున్నారు సగటు కార్యకర్తలు.
విజయవాడలో ఒక్కో టర్మ్ లో ఒక్కొకరి హవా నడిచింది. మొదట్లో ఇక్కడ కమ్యూనిస్టులు రాజ్యమేలారు. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు జెండా పాతారు. వీరి హవా చాలా కాలం సాగింది. ఎన్టీఆర్ హయాంలోనూ, చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్న కాలంలోనూ.. ఇక్కడ కాంగ్రెస్ ఆధిపత్యమే కొనసాగింది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లోనే టీడీపీ ఇక్కడ బలం చాటుకుంది. ఆ తర్వాత అధికారం కోల్పోవడం.. బెజవాడ టీడీపీ నేతలు రోడ్డుకెక్కి ఎంతగా రచ్చ చేసుకున్నారో అందరికీ తెలిసిందే. మొత్తం మూడు వర్గాలుగా విడిపోయారు విజయవాడ టీడీపీ నేతలు. దీంతో.. ఆ పార్టీ చీలికలు,పీలికలుగా మారిపోయింది.
ఈ పరిస్థితిని క్యాష్ చేసుకోవడానికి వైసీపీ నేతలకు మంచి అవకాశం ఇదే. పార్టీ అధికారంలో ఉండడంతో.. విస్తరించడానికి ఇంతకు మించిన తరుణం ఏముంటుందీ? కానీ.. వైసీపీలోని నేతలు కూడా తెలుగు దేశం పార్టీ నేతల్లాగే అంతర్గత గొడవలతో తన్నుకుంటున్నారనే అభిప్రాయం ఉంది. విజయవాడలో వైసీపీకి చాలా మంది బలమైన నేతలు ఉన్నప్పటికీ.. వారిని ఒకతాటి మీదకు తెచ్చేవారే లేకుండా పోయారని అంటున్నారు.
ప్రస్తుతం విజయవాడలోని సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. పశ్చిమ నుంచి గెలిచిన వెల్లంపల్లి మంత్రి కూడా అయ్యారు. అయితే.. సెంట్రల్ ఎమ్మెల్యేతో ఈయనకు లింకు కుదరట్లేదని టాక్. అదే సమయంలో తూర్పు లో యువనేత దేవినేని అవినాష్ కూడా తనవర్గాన్ని డెవలప్ చేసుకునే పనిలో ఉన్నారని అంటున్నారు. ఇక, నగుర పార్టీ ఇన్ ఛార్జ్ గా ఉన్న బొప్పన భవకుమార్ ను వీళ్లెవ్వరూ పట్టించుకోవట్లేదని టాక్.
ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా.. ఎవరి ఆధిపత్యం చాటుకోవడానికి వాళ్లు ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సొంత వ్యాపారాలు చూసుకుంటూ.. వ్యక్తిగత గుర్తింపు కోసమే తహతహలాడుతున్నారని అంటున్నారు. ఇదే కొనసాగితే.. పార్టీ ఎదుగుదల పక్కన పెడితే.. వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు ఎదరయ్యే అకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మరి, అధిష్టానం ఏం చర్యలు తీసుకుంటుందో?