నేపాల్ లో జరుగుతున్న పరిణామాలు ప్రపంచానికి కనువిప్పు కలిగిస్తున్నాయి. ఒకనాడు అమెరికా గూడచారి సంస్థ సి ఐ ఎ ఇతరదేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందని ఇది నయా వలసవాద విధానం లో భాగమని చదువుకున్నాం. చదువుకోవటమే కాదు ఈ విధానానికి వ్యతిరేకంగా నిరసనలు కూడా చేసేవాళ్ళం. అమెరికా నయావలసవాద దోపిడీ పై దేశ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మేధావులు, ముఖ్యంగా వామపక్ష మేధావులు నిరంతరం ప్రచారం చేసేవారు. అదే ఒరవడి ఇప్పటికీ కొనసాగుతూనే ఉందనుకోండి. అది ఎక్కడదాకా వెళ్లిందంటే చైనా మన భూభాగం పైకి వచ్చి మన జాతీయ భద్రతకు ప్రమాదం గా మారినా మనం మాత్రం మన అవసరాల కోసం అత్యాధునిక ఆయుధాలు అమెరికా నుంచి కొనుగోలుచేస్తే తప్పుపట్టేదాకా. అదేసమయంలో ఆ ఆయుధాలు లేకుండా చైనా కు దీటుగా ఎలా ధైర్యంగా నిలబడగలమో చెప్పరు. అసలు చైనా దురాక్రమణను ఖండించటానికే నోరురానప్పుడు అంతకన్నా ఎక్కువ ఆశించలేమనుకోండి. సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం.
ఈరోజు నేపాల్ లో జరుగుతున్నదేమిటి? ఒకనాడు సి ఐ ఎ చేసిన పనే ప్రత్యక్షంగా చైనా కమ్యూనిస్టు పార్టీ చేస్తుంది. అదేమంటే సోదర కమ్యూనిస్టు పార్టీ కాబట్టి సంప్రదింపులు జరుపుతున్నామని చెబుతుంది. మరి సంప్రదింపులు జరుపుతున్న దెవరు? కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులు కాదుగదా. చైనా రాయబారి నేపాల్ కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరిపి నేపాల్ ప్రధానమంత్రి ఓలి ని కొనసాగించాలని ఒత్తిడి తెచ్చింది. ఇంతకన్నా ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం ఇంకేముంటుంది? అసలు అక్కడ ఏం జరుగుతుంది. గత ఎన్నికలముందు నేపాల్ కమ్యూనిస్టుపార్టీ, నేపాల్ మావోయిస్టు పార్టీలు విలీనం అయ్యాయి. అప్పుడు ఒప్పందం షరతుల్లో ఒకవేళ పార్టీ అధికారం లోకి వస్తే మొదటి రెండున్నర సంవత్సరాలు పాత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ప్రధాన మంత్రిగా మిగతా రెండున్నర సంవత్సరాలు గత మావోయిస్టు పార్టీ నాయకుడు ప్రచండ ప్రధానమంత్రిగా వుండాలని నిర్ణయించుకున్నారు. దాని ప్రకారమే ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి ప్రధాన మంత్రి పదవి చేపట్టాడు. ఒప్పందం ప్రకారం ఈ జూలై లో తను తప్పుకొని ప్రచండ కు ప్రధానమంత్రి పదవి అప్పచెప్పాలి. కానీ ప్రధాన మంత్రి ఓలి పదవినుంచి తప్పుకోవటానికి ఇష్టపడటం లేదు. దానితోపాటు తన పాత పార్టీ లోని సీనియర్ నాయకులు కూడా ఓలి పై తీవ్ర అసంతృప్తి లో వున్నారు. కారణం తన హయాం లో పరిపాలన అస్తవ్యస్తంగా తయారుకావటమే. దానికి తోడు తీవ్ర అవినీతి ఆరోపణలు కూడా రావటం. అందుకనే ప్రచండతో పాటు తన పాత పార్టీ సహచరులు కూడా ఒప్పందం ప్రకారం ఓలి తప్పుకోవాలని కోరారు.
పదవి కోసం భారత్ వ్యతిరేక ప్రచారం
ఓలి కి ఎలాగైనా పదవిలో కొనసాగాలని వుంది. అందుకని తెలివిగా తన పదవిని నిలబెట్టుకోవటం కోసం పడరాని పాట్లు పడుతున్నాడు. ఒప్పందాన్ని తుంగలో తొక్కాడు. కమ్యూనిస్టు పార్టీ స్టాండింగ్ కమిటీ లో తను పూర్తిగా మైనారిటీలో పడ్డాడు. అయినా పదవిలో కొనసాగటానికి భారత వ్యతిరేక ప్రచారానికి తెర తీసాడు. భారత్ తో అపరిష్కృతంగా వున్న సరిహద్దు సమస్యను ముందుకు తెచ్చాడు. సంప్రదింపులకు బదులు ఏకంగా ఆ భూభాగం తనదేనని మ్యాపులను తయారు చేసి పార్లమెంటులో తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. తన ఎత్తుగడ ఏమిటంటే పార్టీలో ఈ దుందుడుకు వాదాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే భారత అనుకూలురుగా ముద్రవేసి దేశ ప్రయోజనాల రీత్యా తను పదవిలో వుండటం అవసరమని చెప్పాలనుకున్నాడు. అయితే రాజకీయాల్లో అందరూ ఉద్దండులే కదా. ఆ పాచిక పారకుండా ఏకగ్రీవంగా పార్లమెంటులో తీర్మానాన్ని ఆమోదించటంతో ఏమి చేయాలో దిక్కు తోచలేదు. చివరకు చైనా రాయబారిని కలిసి మొరపెట్టుకున్నాడు. అప్పటికే ఆవిడ నేపాల్ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూనే వుంది. ప్రోటోకాల్ తో సంబంధం లేకుండా ఆవిడ ఎప్పుడైనా ఎవరినైనా కలుసుకోగలదు, ఎక్కడికైనా వెళ్ళగలదు. ఓలి హయాంలో ఆవిడ సూపర్ ప్రధాన మంత్రిగా వుందని నేపాలి పత్రికలే కోడై కూస్తున్నాయి. చివరకు ఆవిడ ప్రత్యక్షంగా కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులందరిని వ్యక్తిగతంగా కలిసి ఓలి ని ప్రధాన మంత్రిగా కొనసాగించాలని కోరింది. మొదట్లో ప్రచండ కలవటానికి తటపటాయించినా చివరకు కలవటం జరిగింది. ఈ విషయమే ఆవిడతో పత్రికా విలేఖరులు ప్రస్తావిస్తే దానిలో తప్పేముంది మా సోదర పార్టీ లో సఖ్యత కోసం మా ప్రయత్నాలు మేము చేస్తామని సమాధానమిచ్చింది. ఇక్కడ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. ఆవిడ చైనా ప్రభుత్వ రాయబారి. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి కాదు. అంత మొహమాటం లేకుండా నిసిగ్గుగా వేరే దేశపు అంతరంగిక వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం చేసుకోవటం ఏవిధంగా చూసినా గర్హనీయం. అదీ మన పొరుగుదేశం లో, మనతో సరిహద్దు ఆంక్షలు లేని దేశంలో. భారత్ వ్యతిరేక కార్యకలాపాలు జరగాలంటే ఓలి ప్రధానమంత్రిగా కొనసాగటం అవసరమని చైనా ప్రత్యక్షంగా జోక్యం చేసుకొని కమ్యూనిస్టు పార్టీ నాయకులపై ఒత్తిడి తెచ్చి ఓలి ని తాత్కాలికంగా రక్షించిన సంగతి ప్రపంచమంతా చూసింది. ఈ చర్యలు అంతకుముందు సి ఐ ఎ చేసిన కార్యకలాపాలతో సమానమే కదా. అటువంటప్పుడు దీన్ని ఎందుకు ఇక్కడ ‘నయా వలసవాద వ్యతిరేక చాంపియన్లు’ ఖండించరు?
నేపాల్ లో జరిగింది భారత్ లో జరగదని గ్యారంటీ ఏమిటి?
కమ్యూనిస్టులపై మిగతా పార్టీలు ఆరోపణలు చేస్తుంటే అదంతా కావాలని పనిగట్టుకొని వాళ్ళపై కక్ష తో చేస్తున్నారని అందరం అనుకునే వాళ్ళం. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు నాయకులు నిస్వార్ధంగా పనిచేసి పేద ప్రజలకోసం పనిచేసేవారు. కాబట్టి వాళ్ళు ఏమి చెప్పినా వాళ్ళమీద విశ్వాసం తో నమ్మేవాళ్ళ సంఖ్య గణనీయంగా వుండేది. సిద్ధాంతపరమైన లోతైన అవగాహన మేధావులకే పరిమితంగా వుండేది. అదీగాక కొత్తగా స్వాతంత్రం పొందిన దేశంలో పొరుగున వున్న చైనావిప్లవం పై, రష్యా లో వచ్చిన అక్టోబర్ విప్లవంపై విపరీతమైన క్రేజ్ వుండేది. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘనలపై ఎవరైనా చెప్పినా ఇదంతా ప్రాశ్చాత్య ప్రచారం గా కొట్టిపారేసే వాళ్ళం. కానీ ఈ అధునాతన సమాచార యుగం లో దాచేస్తే ఏదీ దాగదు. మానవహక్కుల ఉల్లంఘనలపై పత్యేకంగా మాట్లాడుకుందాం. ప్రస్తుతం మన పొరుగు దేశంలో కమ్యూనిస్టులు అధికారం లోకి వస్తే దేశ ప్రయోజనాలు ఎలా ఒత్తిడికి లోనవుతున్నాయోననే అంశంకి పరిమితమవుదాం. తన పదవిని కాపాడుకోవటం కోసం రోజు రోజు ఏ విధంగా భారత్ వ్యతిరేక ప్రచారానికి ఒడిగడుతున్నాడో చూస్తున్నాం. కరోనా మహమ్మారికి చైనా కారణం కాదని భారత్ దే భాద్యతంతా నని ప్రచారం చేయటం మొదలుకొని రాముడు అసలు అయోధ్యలో పుట్టలేదని నేపాల్ లో పుట్టాడనే దాకా వెళ్ళింది ఈ ప్రచారం. ఇక్కడ మనందరం ఆలోచించాల్సింది ఒక్కటే. ఈరోజు నేపాల్ లో జరిగింది భారత్ లో జరగదని గ్యారంటీ ఏమిటి? అదృష్టవశాత్తు భారత్ లో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఒక్క శాతం కూడా లేవు( రావాలని కోరుకున్న వాళ్ళలో ఈ రచయిత కూడా ఒకరు ). లేకపోతే ఇక్కడ కూడా నేపాల్ లో లాగా భారత్ లో సోదర కమ్యూనిస్టు పార్టీ పేరుతో మన ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకొని వుండే వాళ్ళే కదా! కాదని ఎలా చెప్పగలం. నేపాల్ లో జరిగిన పరిణామాల్ని ఇక్కడ కమ్యూనిస్టులు ఖండించనప్పుడు వీళ్ళ నిజాయితీ పై నీలి నీడలు కమ్ముకోవటం సహజమే కదా. సి ఐ ఎ చేసినా , చైనా కమ్యూనిస్టు పార్టీ చేసినా తప్పు తప్పే కదా. సి ఐ ఎ చేస్తే తప్పు చైనా కమ్యూనిస్టు పార్టీ చేస్తే ఒప్పు అవ్వదు కదా. ఇప్పటికైనా కమ్యూనిస్టు పార్టీ లో నిజాయితీగా పనిచేస్తున్న ఎంతోమంది క్యాడర్ పునరాలాచించు కోవలసిన అవసరం వుంది. ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం పేరుతో దేశ ప్రయోజనాలకి విఘాతం కలిగించే బదులు మన దేశ కమ్యూనిస్టులు, సోషలిస్టులు ఏకమై దేశీయ ప్రజాస్వామ్య సోషలిస్టు పార్టీగా అవతరించాల్సిన అవసరం ఎంతయినా వుంది. పొరుగు దేశ పరిణామాలు చూసిన తర్వాత నయినా ఆత్మ పరిశీలన చేసుకుంటారని ఆశిద్దాం.
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: Condemn chinese interference in nepal politics
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com