
Babu Mohan: కార్యకర్తలే ఏ పార్టీకైనా పట్టుకొమ్మలు. కార్యకర్తలు లేని పార్టీ.. అసలు పార్టీనే కాదు. రాజకీయాల్లో క్రియాశీలక కార్యకర్తల పాత్ర విస్మరించదగ్గది కాదు. నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు దొరకడం నిజంగా రాజకీయ పార్టీల అదృష్టం. కానీ అలాంటి అదృష్టాన్ని ఓ జాతీయ పార్టీ నేత కాలదన్నారు. కలిసి పనిచేస్తానన్న కార్యకర్త పై బూతులతో దాడి చేశారు. ఇంతకీ ఆ నేత ఎవరు ? ఎందుకంత కోపమో స్టోరీలో చదివేయండి.
బాబుమోహన్.. కమెడియన్ గా తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులు. తెలంగాణలోని ఆంధోల్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీ నాయకుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈయన గురించి ఇంత ఉపోద్ఘాతం ఎందుకు అనుకుంటున్నారా ? . అసలు సమస్యంతా ఇక్కడ బాబూమోహన్ వల్లే. బాబుమోహన్ మాట్లాడిన ఓ ఫోన్ కాల్ ఇప్పుడు వైరల్ గా మారింది. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
బాబుమోహన్ ప్రస్తుతం బీజేపీ నాయకుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఆంధోల్ కు చెందిన బీజేపీ కార్యకర్త వెంకటరమణ .. బాబుమోహన్ కు ఫోన్ చేశారు. “ సార్ మీతో కలిసి పార్టీ కోసం పనిచేయాలని అనుకుంటున్నా “ అని చెప్పాడు. ఇక అంతే.. బాబుమోహన్ కు పట్టరాని కోపం వచ్చింది. బూతులతో అతని పై మాటల దాడి చేశాడు. “ నువ్వెంత, నీ బతుకెంత ?, ఇంకోసారి ఫోన్ చేశావంటే .. చెప్పుతో కొడతా “ అంటూ తిట్లపురాణంతో రెచ్చిపోయాడు.

పనిలో పనిగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై కూడా రెచ్చిపోయాడు. “ బండి సంజయ్ .. ఎవడ్రా.. వాడు నా తమ్ముడు “ అంటూ చెప్పుకొచ్చాడు. తనది ప్రపంచ స్థాయి అని కార్యకర్తలకు హితవు పలికారు. మీ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడాలని కార్యకర్తలకు సూచించారు. ప్రస్తుతం బాబుమోహన్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పార్టీ కోసం పనిచేస్తానన్న కార్యకర్తకు ఇచ్చే మర్యాద ఇదా ? అంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. ఇలాంటి తరుణంలో బాబూమోహన్ మాటలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.
కార్యకర్తలు దొరకడమే మహాప్రసాదం అనుకుంటున్న తరుణం ఇది. అలాంటిది కష్టపడి కలిసి పనిచేస్తానన్న కార్యకర్త పై ఇలా బూతులతో మాటల దాడి చేయడం సబబా ? సభ్య సమాజానికి బాధ్యతాయుత స్థానంలో ఉండి ఇచ్చే సమాధానం ఇదా ? అన్న చర్చ ప్రజల్లో జరుగుతోంది. బాబుమోహన్ అహంకారపూరిత వైఖరిని ప్రతిపక్షాలు కూడా తప్పుపడుతున్నాయి.