ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రెండున్నరేళ్ల క్రితమే మంత్రివర్గం ప్రమాణ స్వీకార సమయంలోనే మళ్లీ విస్తరణ ఉంటుందని చెప్పారు. దీంతో ప్రస్తుతం మంత్రివర్గాన్ని విస్తరించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్ కూడా ఇదే తీరుగా ఒకేసారి మంత్రివర్గాన్ని మార్చి సంచలనం సృష్టించారు. అదే కోవలో ప్రస్తుతం జగన్ కూడా తన మంత్రి వర్గాన్ని పూర్తిస్థాయిలో మార్చాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

కేబినెట్ లో ఉన్న సీనియర్లు, జూనియర్లను అందరిని తప్పించి కొత్త వారికే పదవులు కట్టబెట్టాలని చూస్తున్నారని చెబుతున్నారు. వైసీపీలో ఇప్పటివరకు జగన్ నిర్ణయమే శిరోధార్యం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అందరు కట్టుబడి ఉండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి వర్గ విస్తరణపై అందరిలో ఆశలు రేకెత్తుతున్నాయి. కొత్త వారికే పదవులు దక్కే సూచనలుండడంతో అధికార పార్టీ నేతలు తమ ప్రయత్నాలు చేస్తున్నారు.
మంత్రి వర్గ వస్తరణలో రోజా, ఆనం, పార్థసారధి, అనంత వెంకట్రామిరెడ్డి లాంటి వారు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణ చేపడితే సీనియర్ల నుంచి వ్యతిరేకత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో విస్తరణ చేపడితే జగన్ కు కొత్త చిక్కులు ఎదురయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 2024లో అధికారంలోకి రావడమే ధ్యేయంగా జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే పార్టీలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అంతర్గత పోరు సాగుతున్నట్లు తెలుస్తోంది. నేతల మధ్య కూడా ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్లు సమాచారం. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతున్నా కొన్ని సందర్భాల్లో విభేదిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో పార్టీపై సానుకూలత ఉండేలా చూసుకోవాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా రాబోయే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.