Mamata Banerjee : పశ్చిమ బెంగాల్‌లోని ఆర్‌జీ కార్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటన బెంగాంల్‌తోపాటు దేశ వ్యాప్తంగా ఆందళనలు పెరుగుతున్నాయి. గడిచిన ఐదు రోజులుగా ఈ ఘటనపై బెంగాల్ అట్టుడుకుతోంది. ఈ ఘటనకు సీఎం మమతా బెనర్జీ బాధ్యత వహించాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేస్తోంది. నిందితులను కఠినంగా శిక్షించి బాధితులకు న్యాయం చేయాలని వైద్య విద్యార్థులు కోరుతున్నారు. ఇలాంటి సమయంలో దోషులను శిక్షించాల్సిన బెంగాల్ సీఎం మమతాబెనర్జీ కూడా రోడ్డెక్కుతున్నారు. బెంగాల్‌లో విధ్వంసం వెనుక సీపీఎం, బీజేపీ ఉన్నాయంటూ ఆమె ఇప్పటికే ఆరోపించారు.మరోవైపు స్వాతంత్య్రం వచ్చిన అర్ధరాత్రి మహిళల స్వాతంత్య్రం కోసం’ అంటూ శుక్రవారం(ఆగస్టు 16న) బెంగాల్‌లో నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మహిళలు అర్ధరాత్రి నిరసన వ్యక్తం చేశారు. నిరసనకారులుగా పేర్కొంటూ సుమారు 40 మంది గుంపు అర్ధరాత్రి ఆర్‌జీ కార్ ఆసుపత్రిలోకి చొరబడి విధ్వంసం సృష్టించింది. హాస్పటల్ ప్రాంగణంలోకి చేరుకున్న ఆందోళనకారులు ఎమర్జెన్సీ విభాగాన్ని, నర్సింగ్ స్టేషన్, మందుల స్టోర్, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను అదుపుచేయడానికి పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. ఈ ఘటనలో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. విధుల్లో ఉన్న తమకు రక్షణ కల్పించాలంటూ నర్సులు ఆందోళన చేశారు.
రోడ్డెక్కనున్న మమత..
ఈ క్రమంలో సీఎం మమతా కోల్‌కత్తాలో రొడ్డెక్కాలని నిర్ణయించారు. అత్యాచారం కేసు వివరాలు, విచారణ త్వరగా పూర్త చేయాలని కోల్‌కతా వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ తెలిపారు. ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు దర్యాప్తు వివరాలను రోజూ ఇవ్వాలని, ఆగస్టు 17(ఆదివారం)లోపు దోషులకు ఉరిశిక్ష విధించాలని ఆమె కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐఈ)కి అల్టిమేటం ఇచ్చారు. ఇదిలా ఉంటే పోలీసులు కేసును తప్పుదారి పట్టించారని, అధికార టీఎంసీ సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం మమతా ర్యాలీకి పిలుపునివ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో పోలీసు, హెూంశాఖ పోర్టుపోలియే మమత వద్దనే ఉంది.
దొంగే.. దొంగ అన్నట్లు..
టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ర్యాలీకి పిలుపునివ్వడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విపక్ష బీజేపీ, సీపీఎం మమత ర్యాలీపై విమర్శలు చేస్తున్నాయి. నిరసన కారులు కూడా దోషులను పట్టుకోవాల్సిన ముఖ్యమంత్రి రోడ్డుపైకి వచ్చి ర్యాలీ తీయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించి మూడు వారాల గడువు ఇచ్చింది. ఈ క్రమంలో సీబీఐ విచారణ మొదలు పెట్టింది. కానీ, మమతా బెనర్జీ ఆగస్టు 17 వరకు విచారణ ముగించాలని అల్టీమేటం ఇవ్వడం, అందుకోసం ర్యాలీకి పిలుపునివ్వడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం మమత తన పరువు కాపాడుకోవడానికి, ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే ఇలా ర్యాలీకి పిలుపునిచ్చారన్న అభిప్రాయం వ్యక‍్తమవుతోంది.