
KCR -Ambedkar Statue : కేసీఆర్ కలలు ఇవీ తెలంగాణ సీఎం కేసీఆర్ దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన జయంతి రోజునే హైదరాబాద్ లో ఆవిష్కరించారు. హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేసిన 125 అండుగుల భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని ఆయన మనవడు ప్రకాష్ అంబేద్కర్ చేత ఆవిష్కరింప చేయించారు. ఈ సందర్భంగా తన పార్టీ, అంబేద్కర్ సిద్ధాంతాలు కేసీఆర్ కలలపై మాట్లాడారు.
తెలంగాణలో ఇప్పటివరకూ కొన్ని నియోజకవర్గాలకే కేసీఆర్ దళితబంధు ఇచ్చారు. హుజూరాబాద్ లాంటి ఎన్నికలు జరిగే నియోజకవర్గంలో అమలు చేశారు. ఇక దళిత ఎమ్మెల్యేల ఒత్తిడితో ఆ నియోజకవర్గంలోనూ ఇస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ దేశంలో అధికారంలోకి వస్తే దేశమంతా ఏటా 25 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇస్తామని కేసీఆర్ అతిపెద్ద హామీనిచ్చారు.
దళిత ప్రముఖుడైన కత్తి పద్మరావు కోరిక మేరకు ‘అంబేద్కర్’ పేరిట ఏటా అవార్డు కూడా ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం రూ.51 కోట్లతో నిధి ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దానిపై ఏటా రూ.3 కోట్ల వరకూ వడ్డీ వస్తుందని.. అంబేద్కర్ జయంతి రోజున ఉత్తమ సేవలు అందించిన వారికి ఈ డబ్బులతో రాష్ట్ర ప్రభుత్వం తరుఫున అవార్డులు ఇచ్చేందుకు కేసీఆర్ నిర్ణయించారు.
దేశమంతా ప్రచారం జరిగేలా కేసీఆర్ ఈ వేడుకను నిర్వహించారు. పేపర్లకు, మీడియాకు భారీ ప్రకటనలు ఇచ్చారు. జాతీయ స్థాయిలో దళిత బంధుగా తనను తాను ఫోకస్ చేసుకున్నారు.ఎట్టకేలకు తన లక్ష్యం నెరవేరినట్టుగా కేసీఆర్ భావిస్తున్నారు. మరి ఈ విగ్రహంతోనైనా కేసీఆర్ క్రేజు దేశంలో కాకున్నా తెలంగాణలో ఇనుమడిస్తుందా? లేదా? అన్నది చూడాలి.