
MLC Election: తెలంగాణలో మరో ఎన్నికలకు నగారా మోగింది. అదేంటి ఈ మధ్యే కదా హుజూరాబాద్ పోరు ముగిసింది. మళ్లీ ఇప్పుడేంటి ఎన్నికలు అనుకుంటున్నారా ? అవునండి మళ్లీ ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి. కానీ అవి సాధారణ ప్రజలు ఓటు వేసే ఎన్నికలు కావు. మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు ఓటు వేసే ఎన్నికలు. ఇటీవల 6 ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. వారిని ఎమ్మెల్యేలు ఎన్నుకోవాల్సి ఉంటుంది. అందుకే మరో సారి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి కనిపించనుంది. దాదాపు ఇందులో అధికార పార్టీలకు చెందిన వారే, లేదా ఆ పార్టీ సూచించించన అభ్యర్థులుగా ఎన్నికవుతారు. ఎందుకంటే ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే మన శాసన సభలో అధికంగా ఉన్నారు.
సామాజిక వర్గాల వారీగా ప్రియారిటీ..
హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల వెంటనే వచ్చిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్శిస్తున్నాయి. ఈ పదవుల కేటాయింపులో సీఎం ఎలా నిర్ణయం తీసుకోబోతున్నారనే అంశంలో రాజకీయ వర్గాలు విశ్లేషణలు చేస్తున్నాయి. కచ్చితంగా హుజూరాబాద్ ఫలితం దీనిని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. శాసన సభలో ఇప్పటి ప్రాతినిధ్యం లేని సామాజిక వర్గాలకు ఇందులో స్థానం కల్పించాలని సీఎం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే వారి పేర్లు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గం నుంచి ఇటీవల టీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి ఎల్.రమణకు స్థానం దక్కేలా కనిపిస్తోంది. విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి మాజీ స్పీకర్ మధుసూదనాచారి, రెడ్డి సామాజిక వర్గం నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంసీ కోటి రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఓసీ సామాజిక వర్గం నుంచి సీఎం ఆఫీస్ ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్, వెలమ సామాజిక వర్గం నుంచి తక్కల్లపల్లి రవీందర్ రావు పేర్లు దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తోంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి కడియం శ్రీహరి, ఎర్రోళ్ల శ్రీనివాస్, లేదా ఇటీవలే పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులకు అవకాశం ఇచ్చేలా కనిపిస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో వీరు పేర్లు అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది.
నిరాశవాదులకు మళ్లీ ఛాన్స్..
ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ(MLC Election) పదవి ఆశించి భంగపడిన వారికి మళ్లీ వచ్చే ఎన్నికల్లో పదవులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ లో మరో 12 ఎమ్మెల్సీ స్థానాలు త్వరలోనే భర్తీ చేయనున్నారు. ఇందులో అవకాశం దక్కని వారికి మళ్లీ అవకాశం ఇస్తామని హామీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మరి ఎమ్మెల్సీ అయి శాసన మండలిలో అడుగుపెట్టేవారు ఎవరో కచ్చితంగా తెలియాలంటే మరి కొద్ది రోజులు ఎదురుచూడక తప్పదు.
Also Read: కేసీఆర్ కు మరో ఉపద్రవం.. ఎమ్మెల్సీ ఆశావహులకు న్యాయం చేస్తారా?