తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘దళిత బంధు’ పథకం ఇవాళ మొదలైంది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం శాలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా 15 మంది లబ్ధిదారులకు సీఎం స్వయంగా చెక్కులు అందించారు. ఈ సందర్భంగా సుదీర్ఘ ప్రసంగం చేశారు ముఖ్యమంత్రి. దళిత బంధు పథకం దేశానికే ఆదర్శం కాబోతోందని అన్నారు. ప్రస్తుతం ఈ పథకం కోసం రూ.500 కోట్లు విడుదల చేశామని, రానున్న 15 రోజుల్లో.. మరో 2 వేల కోట్లు విడుదల చేస్తామని తెలిపారు.
ఈ పథకం నిన్నామొన్న ఆలోచించిందని, 25 సంవత్సరాల కిందనే తన మనసులో ఉందని చెప్పుకొచ్చారు కేసీఆర్. తాను సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళిత జ్యోతి పేరుతో పాటలు కూడా విడుదల చేశానని చెప్పారు. అందరూ కలిసి కట్టుగా పనిచేస్తే.. దళిత వాడలన్నీ బంగారు మేడలవుతాయని అన్నారు. అయితే.. దానికి ఓపిక, నైపుణ్యం కావాలన్నారు.
దళిత బంధు పథకం సంవత్సరం క్రితమే మొదలు కావాల్సిందని చెప్పిన ముఖ్యమంత్రి.. కరోనా కారణంగా ఏడాది ఆలస్యమైందని చెప్పుకొచ్చారు. దళిత బంధు ఎవరికి ఇస్తామనే విషయం కుండబద్ధలు కొట్టినట్టు చెబతామన్నారు. ఈ పథకంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని దళిత మేధావులు, ఉద్యోగులు తరిమి కొట్టాలన్నారు. ఇది ఒక ప్రభుత్వ పథకం కాదని, దీన్ని మహాఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.
హుజూరాబాద్ లోని దళితులందరికీ కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అందజేస్తామని, రాబోయే రెండు నెలల్లో ఇది పూర్తవుతుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి.. ముందుగా నిరుపేదలకు అందించిన తర్వాత వారికి అందుతుందని అన్నారు. ఇప్పుడు రూ.500 కోట్లు మాత్రమే ఇచ్చారని, మిగిలినవి ఇస్తారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారన్న కేసీఆర్.. మిగిలిన డబ్బులు ఇచ్చే దమ్ము కేసీఆర్ కు లేదా అని ప్రశ్నించారు. రాబోయే 15 రోజుల్లోనే మరో 2 వేల కోట్లు విడుదల చేస్తామని అన్నారు.
ఈ డబ్బులతో ఏం చేసుకోవాలన్నది దళితుల ఇష్టమని అన్నారు. వీటిని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. నచ్చిన పని చేసుకోవాలని, కాకపోతే.. ఆ డబ్బులను ఏడాది కాలంలోనే రెట్టింపు చేసుకునేలా పనులు చేసుకోవాలని చూసించారు. ఎలా వాడుకోవాలో తెలియకపోతే కలెక్టర్ ను సంప్రదించాలని, ఆయన సలహాలు, సూచనలు చేస్తారని చెప్పారు కేసీఆర్.
ఈ రాష్ట్రానికి తాను కాకపోతే మరొకరు ముఖ్యమంత్రి అవుతారని, ఎన్నికలనేవి వస్తుంటాయి పోతుంటాయని కేసీఆర్ అన్నారు. అయితే.. తాను ఆశించిన అభివృద్ధి, చేపట్టిన పథకాలను మాత్రం ఎవ్వరూ అడ్డుకోలేరని అన్నారు. రాష్ట్రం ఇప్పుడు ధాన్యం ఉత్పత్తిలో ఎంతో ప్రగతి సాధించిందని, దళితుల జీవితాలు కూడా అదేవిధంగా ఎదగాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. అందుకోసమే దళిత బంధు పథకం తెచ్చినట్టు ముఖ్యమంత్రి వివరించారు.