Homeజాతీయ వార్తలుKCR Election Plan: కేసీఆర్‌ దూకుడు.. విపక్షాలు నాన్చుడు..!

KCR Election Plan: కేసీఆర్‌ దూకుడు.. విపక్షాలు నాన్చుడు..!

KCR Election Plan: తెలంగాణ ఎన్నికలకు మరో మూడు∙నెలల్లో నోటిఫికేషన్‌ రావడం ఖాయం. దీంతో అధికార బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి అధికార పార్టీనే ఎన్నికలకు వెళ్లేందుకు వెనకడుగు వేస్తుంది. జంకుతుంది. ప్రజల్లో వ్యతిరేకతను ఎలా ఎదుర్కొవాలని ఆలోచిస్తుంది. కానీ కేసీఆర్‌ తీరు అందుకు భిన్నంగా ఉంది. తెలంగాణలో విపక్షాలకంటే ముందే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. దూకుడు పెంచుతున్నారు.

అభ్యర్థుల జాబితా రెడీ..
గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా అభ్యర్థులను ముందుగానే ప్రకటించాలని గులాబీ బాస్‌ డిసైడ్‌ అయ్యారు. దీంతో ఇప్పటికే కసరత్తు పూర్తిచేసిన కేసీఆర్‌ 80 మంది పేర్లతో ఫస్ట్‌ లిస్ట్‌ తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 21న శ్రావణ సోమవారం మంచి ముహూర్తం ఉన్నందున తొలి జాబితా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది.

పొత్తులు, అవగాహన..
మరోవైపు కేసీఆర్‌ వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భద్రాచలం సీపీఎంకు, మునుగోడు సీపీఐకి ఇవ్వాలని డిసైడ్‌ అయినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు వచ్చే ఎన్నికల్లో 40 స్థానాల్లో పోటీ చేస్తామన్న ఎంఐఎంను మచ్చిక చేసుకునే పని కూడా ప్రారంభించారు. ఇప్పటికే ఎంఐఎం అడిగిన పనులన్నీ చేసేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ లేకుండా చేసుకుంటున్నారు.

స్లోగా విపక్షాలు..
ఇక తెలంగాణలో విపక్షాల ఇంకా ఎన్నికలకు సిద్ధం కానట్లే అనిపిస్తోంది. ఒకవైపు కేసీఆర్‌ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయగా, కాంగ్రెస్‌ ఇప్పుడే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. బీజేపీ కూడా ఇప్పుడు ఎంపిక ప్రక్రియ ప్రారంభించింది. చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ ఎన్నికలకు ఇప్పటికే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన బీజేపీ తెలంగాణ అభ్యర్థుల జాబితా కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 30 మందితో మొదటి లిస్ట్‌ ప్రకటిస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

చేరికలపై సీక్రెట్‌ ఆపరేషన్‌..
ఇదిలా ఉంటే బీజేపీ పార్టీలో చేరికలపై సీక్రెట్‌ ఆపరేషన్‌ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈనెల 27న ఖమ్మంలో నిర్వహించే అమిత్‌షా సభలో 22 మంది చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందులో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఏది ఏమైనా.. అధికారంలో ఉండి, ప్రజా వ్యతిరేకతను ఎందుర్కొంటున్న కేసీఆర్‌ ఈసారి కూడా విపక్షాల కంటే ముందే ఎన్నికల క్షేత్రంలోకి దిగబోతున్నారు. సంక్షేమంతోనే కాంగ్రెస్, బీజేపీలను కొట్టాలని చూస్తున్నారు. అయితే ఎన్నికల్లో ఒకమాట.. ఎన్నికల తర్వాత ఒకమాట చెప్పే కేసీఆర్‌ను ఇప్పటికే రెండుసార్లు విశ్వసించిన తెలంగాణ ఓటర్లు.. ఈసారి ఎటువైపు మొగ్గు చూపుతారో చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular