Homeజాతీయ వార్తలుCM KCR -Artisans: ఎవరికీ పట్టని ఆర్టిజన్స్‌ గోడు.. అమలు కాని సీఎం హామీ!

CM KCR -Artisans: ఎవరికీ పట్టని ఆర్టిజన్స్‌ గోడు.. అమలు కాని సీఎం హామీ!

CM KCR -Artisans
CM KCR -Artisans

CM KCR -Artisans: ‘తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులు ఉండరు. దిక్కుమాలిన కాంట్రాక్టు విధానం రద్దు చేస్తం.. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ రెగ్యులర్‌ చేస్తం’ తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక పలుమార్లు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పిన మాటలివీ. రాష్ట్రం వచ్చి తొమ్మిదేళ్లు దాటింది. విద్యుత్‌ శాఖలో కాంట్రాక్ట్‌ కార్మికుల పేరు ఆర్టిజన్లుగా మారిందే తప్ప.. రెగ్యులరైజ్‌ కాలేదు. వేతన స్కేలు, టీఏ, డీఏ, హెచ్‌ఆర్‌ఏ వంటివేవీ అమలు కావడం లేదంటున్నారు. 1959 నుంచి కరెంట్‌ కంపెనీల్లో కొనసాగుతున్న ఏపీఎస్‌ఈబీ విధానాలు అమలు చేయట్లేదు. ఇవన్నీ లేకుండా తాము రెగ్యులరైజ్‌ ఎలా అయినట్టని ప్రశ్నిస్తున్నారు.

ఒక్క సంతకంతో 23 వేల మందిని రెగ్యులరైజ్‌ చేస్తామన్న కేసీఆర్‌..
2013, అక్టోబరు 5న ఉద్యమ నేతగా మింట్‌ కాంపౌండ్‌లో కేసీఆర్‌ తెలంగాణ కాంట్రాక్టు ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఒక్క సంతకంతో 23 వేల మంది కార్మికులను రెగ్యులరైజ్‌ చేస్తానని హామీ ఇచ్చారు. ‘రాష్ట్రం వచ్చి తొమ్మిదేళ్లయింది. ఉద్యమ నేత కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిండు. అమెరికా నుంచి వచ్చిన ఆయన కొడుకు మంత్రి అయిండు. బిడ్డ ఎంపీ, ఎమ్మెల్సీ అయింది. అల్లుడు మంత్రి అయిండు. సడ్డకుని కొడుకు ఎంపీ అయిండు’ మమల్ని అయితే రెగ్యులరైజ్‌ చేయలేదని ఆర్టిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్లుగా పనిచేస్తున్నా జీతం రూ.25 వేలు దాటలేదని పేర్కొంటున్నారు. 23,667 మంది ఆర్టిజన్లకు ఏపీఎస్‌ఈబీ సర్వీస్‌ రూల్స్‌ వర్తింపజేయాలన్న డిమాండ్‌ చేస్తున్నారు.

కోర్టు తీర్పు ఇచ్చినా…
కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులరైజ్‌ చేస్తున్నట్టు 2017, జులై 29న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆర్టిజన్లుగా పేరు మార్చింది. వేతనం రూ.14 వేలుగా నిర్ణయించింది. అయితే, ఉత్తర్వులొచ్చిన మూడు రోజులకే సత్యంరెడ్డి అనే లాయర్‌, కార్మికుల రెగ్యులరైజేషన్‌ను వ్యతిరేకిస్తూ హైకోర్టులో కేసు వేశారు. కోర్టు స్టే ఇచ్చింది. దీంతో 2018, జులై 21న ఆర్టిజన్లు సమ్మెకు దిగారు. అదే నెల 29న కార్మికులతో విద్యుత్‌ శాఖ మంత్రి చర్చలు జరిపారు. జీతాన్ని రూ.14 వేల నుంచి రూ.25 వేలకు పెంచేందుకు ప్రభుత్వం ఒప్పుకుంది. కోర్టు ఓకే చెప్పగానే రెగ్యులరైజ్‌ చేస్తామని మాట ఇచ్చారు. ఆర్టిజన్లను రెగ్యులరైజ్‌ చేసుకోవచ్చంటూ గత ఏడాది సెప్టెంబర్‌ 18న కోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ చేయలేదు.

రెగ్యులర్‌ చేసినట్లు ప్రకటించిన కేసీఆర్‌..
ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం ఆర్టిజన్లందరినీ రెగ్యులరైజ్‌ చేసి ఉద్యోగాలిచ్చినట్టు అసెంబ్లీలో ప్రకటించారు. వేతనాలు కూడా రూ.14వవేల నుంచి రూ.25 వేలకు పెంచినట్లు తెలిపారు. తమది ఎంప్లాయ్‌ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ అండీ అంటూ జబ్బలు చరుచుకున్నారు. వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. రెగ్యులర్‌ ఉద్యోగులకు వచ్చే వెసులుబాట్లేవీ వాళ్లకు అందట్లేదు. ప్రమాదాల్లో ఆర్టిజన్లు చనిపోయినా వారి కుటుంబాల్లోని వ్యక్తులకు కారుణ్య నియామకాల్లో జాబ్‌ వచ్చే పరిస్థితి లేదు. ప్రైవేట్‌ కంపెనీల రూల్స్‌ను అమలు చేస్తామని విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు చెబుతుండటంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

పిల్లలకు తిండి పెట్టలేకపోతున్నామని ఆవేదన..
కోర్టు తీర్పు ఇచ్చినా ఆర్టిజన్లకు రెగ్యులర్‌ ఉద్యోగులకు వచ్చే వెసులుబాట్లేవీ అమలు కాకపోవడంతో అధికారులకు, మంత్రికి పలుమార్లు విన్నవించారు. చేస్తాం.. చూస్తాం అన్న హామీ తప్ప పనిమాత్రం చేయడం లేదు.

బిల్‌ కలెక్టర్ల పరిస్థితి మరీ దారుణం..
ఇక విద్యుత్‌ బిల్‌ కలక్టర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వారిని ఆర్టిజన్లుగా కూడా గుర్తించడం లేదు. దీంతో నెలలో 30 రోజులు పనిచేస్తూనే ఉన్నా… పిల్లలకు రెండు పూటలా తిండి పెట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలంతా పనిచేసినా రూ.3,500 మించి వేతనం రావడం లేదు. బతకడమే కష్టమైంది. 30 ఏళ్లుగా పనిచేస్తున్న తమను ఆర్టిజన్లుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఇంత వరకు అమలు కాలేదంటున్నారు. తమను గుర్తించి కనీసం వేతనం ఇవ్వాలని కోరుతున్నారు.

CM KCR -Artisans
CM KCR -Artisans

‘బండి’కి వినతి
తమకు కనీసం వేతనం అందడం లేదని, ఆర్టిజన్లుగా గుర్తిస్తామని కేసీఆర్‌ ఇచ్చిన హామీ అమలు కావడం లేదని ‘‘మీరైనా న్యాయం జరిగేలా చూడండి’’అంటూ తెలంగాణ విద్యుత్‌ బిల్‌ కలెక్టర్లు పలువురు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని వేడుకున్నారు. కరీంనగర్‌లో శుక్రవారం సంజయ్‌ను కలిసి వినతిపత్రం అందించారు. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మంది బిల్‌ కలెక్టర్లు ఏళ్ల తరబడి వెట్టిచాకిరీ చేస్తునానమని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కాలంలో కూడా ప్రాణాలకు తెగించి పనిచేశామని తెలిపారు. కరోనాతో కొందరు సహోద్యోగులు ప్రాణాలు కూడా కోల్పోయినా ప్రభుత్వం ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు అమలయ్యేలా చూడాలని కోరారు. సానుకూలంగా స్పందించిన బండి సంజయ్‌ బిల్‌ కలెక్టర్లకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు.

 

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version