https://oktelugu.com/

KCR On Khammam: తుమ్మల వద్దకు రాయబారం.. పెద్ద ఆఫర్.. ఆపరేషన్ ఖమ్మం చేపట్టిన కేసీఆర్

ఖమ్మం జిల్లాలో రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ. వాస్తవానికి ఈ జిల్లాలో భారత రాష్ట్ర సమితికి బలం లేదు. ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను ఫిరాయించడం ద్వారానే భారత రాష్ట్ర సమితి బలపడింది.

Written By: , Updated On : August 28, 2023 / 12:57 PM IST
KCR On Khammam

KCR On Khammam

Follow us on

KCR On Khammam: ఖమ్మం జిల్లాలో కీలక నేతగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. పెద్దదిక్కుగా ఉంటారు అనుకుంటే తుమ్మల నాగేశ్వరరావు బల ప్రదర్శన చేశారు. ఇప్పటికే పాలేరు అసెంబ్లీ స్థానంలో కందాల ఉపేందర్ రెడ్డిని కెసిఆర్ ప్రకటించినప్పటికీ.. తాను కూడా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.. ఉన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీద సానుకూలతల కంటే వ్యతిరేక పవనాలే ఎక్కువగా ఉన్నాయి. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తాతా మధు పార్టీ అభివృద్ధి కోసం చేసింది చాలా తక్కువ. ఇక మిగతా నాయకుల్లో ఒకరంటే ఒకరికి పడదు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారత రాష్ట్ర సమితి పరిస్థితి చుక్కాని లేని నావలా మారింది. అంటే గతంలో ఈ నేతలు మొత్తం ఉన్నప్పటికీ 2018 ఎన్నికల్లో ఒక్క స్థానంతోనే ఖమ్మం జిల్లాలో భారత రాష్ట్ర సమితి సరిపెట్టుకుంది.

బలం లేదు

ఖమ్మం జిల్లాలో రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ. వాస్తవానికి ఈ జిల్లాలో భారత రాష్ట్ర సమితికి బలం లేదు. ఇతర పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను ఫిరాయించడం ద్వారానే భారత రాష్ట్ర సమితి బలపడింది. అయితే ఆ ఎమ్మెల్యేలంతా ఇప్పుడు గెలుస్తారా అంటే.. సమాధానం చెప్పలేని పరిస్థితి. మరోవైపు తుమ్మల వంటి నాయకుడు తిరుగుబాటు జెండా ఎగరడంతో పరిస్థితి మరింత అద్వానంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా లేనివిధంగా ఖమ్మం జిల్లాలో పరిస్థితి ఉండడంతో కేసీఆర్ ఎప్పటికప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ఎలా గెలవాలో చెబుతున్నారు. అయితే తుమ్మల తిరుగుబాటు జెండా ఎగరేసిన నేపథ్యంలో ఆ ప్రభావం జిల్లా మొత్తం ఉంటుందని ఊహించిన కేసీఆర్ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు.

హరీష్ మధ్యవర్తిత్వంతో..

తమ జిల్లాలో భారత రాష్ట్ర సమితి ప్లీనరీ జరిగినప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఆ క్రతువులో క్రియాశీలకంగా పని చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావును రంగంలోకి దింపారు. తుమ్మల నాగేశ్వరరావు బుజ్జగించారు. అయితే అప్పట్లో ఆయనకు పదవులు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ చివరికి రక్త హస్తమే తుమ్మలకు ఎదురైంది. తాజాగా ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలోనూ పాలేరు స్థానం తనకు దక్కకపోవడంతో తుమ్మల ఒకింత ఆగ్రహం గా ఉన్నారు. అయితే తుమ్మల అలా ఉంటే పార్టీకి నష్టమని భావించిన కెసిఆర్.. ఈసారి కూడా మళ్లీ హరీష్ రావును మధ్యవర్తిగా పంపుతున్నట్టు తెలుస్తోంది. గతంలో ఈ ప్రక్రియ నెరవేర్చేందుకు ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు ను రంగంలోకి దింపినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితికి సంబంధించి ఢిల్లీ వ్యవహారాలను కేశవరావు పర్యవేక్షిస్తున్నారు. ఆయనకు విశ్రాంతి ఇచ్చి ఆ స్థానాన్ని తుమ్మల నాగేశ్వరరావు తో భర్తీ చేయాలని కెసిఆర్ అనుకున్నట్టు తెలిసింది. దీనివల్ల తుమ్మలకు పదవి లభించడంతోపాటు పార్టీ కూడా ఖమ్మంలో బతికి బట్ట కడుతుందని కెసిఆర్ ఆలోచనగా ఉందని సమాచారం. కేవలం ఆ పదవి మాత్రం కాకుండానే ఇంకా ఏదైనా కేబినెట్ ర్యాంకు స్థాయి పదవిని తుమ్మలకు ఇవ్వాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.. ఖమ్మం జిల్లాలో పార్టీ ప్రతికూల పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. అవి రాష్ట్ర మొత్తం వ్యాపించే ప్రమాదం ఉందని.. వాటిని కట్టడి చేయాలంటే తుమ్మలను దారిలోకి తెచ్చుకోవడం ఒకటే మార్గం అని కెసిఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.