CM KCR- Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్.షర్మిల వాహనాలపై టీఆర్‌ఎస్ నేతల దాడి అరెస్ట్.. బెయిల్.. ఘటనలతో మూడు రోజులుగా కొనసాగుతున్న ఎపిసోడ్‌తో తెలంగాణ సర్కార్ డ్యామేజ్ పెరుగుతుండగా, అదే సమయంలో షర్మిలపై పార్టీలకు అతీతంగా విపక్ష నేతలు ఖండిస్తున్నారు. ప్రజల్లో షర్మిల మైలేజ్ అమాంతం పెరిగింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టారు. దీంతో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో షర్మిలపై జరిగిన దాడి, హైదరాబాద్‌లో అరెస్ట్.. అనంతరం హైకోర్టు నుంచి షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడం.. వంటి పరిణామాలతో ఆమె వార్తల్లో నిలిచారు. అధికార టీఆర్‌ఎస్ తప్ప ఇతర పార్టీలన్నీ వైఎస్ షర్మిలపై జరిగిన దాడిని ఖండించాయి. అరెస్టు చేసిన తీరుపై ప్రజల్లోనూ, టీఆర్‌ఎస్ నేతల్లోనూ వ్యతిరేకత వస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ నేతలు అధికార పార్టీ వైఖరిని ఎండగట్టారు.

దాడితోనూ సానుభూతి..
ఉమ్మడి వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం శంకరం తండా వద్ద వైఎస్.షర్మిలపై దాడి జరిగింది. షర్మిల కాన్వాయ్‌లోని వాహనంపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అనుచరులు దాడికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్సార్‌టీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. షర్మిల కాన్వాయ్‌లోని ఓ వాహనంపై ఎమ్మెల్యే అనుచరులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. మరో కారు అద్దాలను పగులగొట్టారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దానికీ నిప్పంటించారు. అక్కడే అమర్చిన షర్మిల ఫ్లెక్సీలను తగులబెట్టారు. అయితే పోలీసులు టీఆర్‌ఎస్ నాయకులను అరెస్ట్ చేయకుండా షర్మిలనే అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో షర్మిలకు గాయమైంది. దీంతో షర్మిలపైనే సానుభూతి వ్యక్తమైంది.
హైదరాబాద్‌లోనూ అంతే..
తర్వాత సీన్ మొత్తం హైదరాబాద్‌కు మారింది. మరోసటి రోజు షర్మిల డ్యామేజ్ అయిన వాహనాలతో ప్రగతి భవన్‌కు బయల్దేరారు. ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, పార్టీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. షర్మిలను అరెస్ట్ చేసిన తీరు, కోర్టులో హాజరు పర్చడం వంటి చర్యలతో ప్రభుత్వం, పోలీసులపై వ్యతిరేకత వ్యక్తమైంది. పరిస్థితులను మరింత వేడెక్కించాయి.
పోలీసుల వైఫల్యంగా..
ఈ పరిణామాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షర్మిల కాన్వాయ్‌పై దాడి చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డి అనుచరులను కాకుండా బాధితురాలినే అరెస్ట్ చేయడం, పాదయాత్రను అడ్డుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. టీఆర్‌ఎస్ యేతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగాన్ని తప్పుపట్టారు. పోలీసుల వైఫల్యం వల్లే ఈ ఉదంతం చోటు చేసుకుందంటూ మండిపడ్డారు.

సీపీపై వేటు..
రోజురోజుకూ పెరుగుతున్న డ్యామేజీకి చెక్ పెట్టేందుకు కేసీఆర్ రంగంలోకి దిగారు. వరంగల్ నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషిపై బదిలీ వేటు వేసింది. ఆయనకు పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. పోలీస్ డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తరుణ్ జోషి స్థానంలో – హైదరాబాద్ నగర పోలీస్ జాయింట్ కమిషనర్(ట్రాఫిక్) ఏవీ.రంగనాథ్‌ను వరంగల్‌కు బదిలీ చేశారు. రంగనాథ్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్‌గా అపాయింట్ చేశారు.