Telangana- Investigative Agencies: తెలంగాణలో కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల మధ్య దంగల్ హోరాహోరీగా సాగుతోంది. ఇందులో కేంద్రం దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు ప్రదర్శిస్తుంటే.. రాష్ట్ర దర్యాప్తు సంస్థ సిట్ అంతకంతకూ తేలిపోతోంది. సిట్ ఇంత వరకూ తెలంగాణ బయట వ్యక్తుల్ని ఒక్కర్ని కూడా రప్పించి ప్రశ్నించలేకపోయింది. ఇద్దరిపై లుకౌట్ నోటీసులు జారీచేసినా ప్రయోజనం లేకపోయింది. అరెస్టులు చేస్తామని హడావుడి చేస్తోంది కానీ.. వారు వెంటనే కోర్టులకు వెళ్లి సిట్ తీరుపై అనుమానాలు, సందేహాలు లేవనెత్తుతున్నారు. దీంతో సిట్ ముందరి కాళ్లకు ఎప్పటికప్పుడు బంధాలు పడుతున్నాయి.

ఆధారాలు సేకరించిన స్పష్టత కరువు..
సిట్ బీజేపపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు ఇచ్చిన నోటీసులపై ఇప్పటికే స్టే ఉంది. తుషార్‌నూ అరెస్ట్ చేయవద్ది హైకోర్టు చెప్పింది. సీబీఐకి ఇవ్వాలని ఆయన వేసిన పిటిషన్ విచారణలో ఉంది. సిట్ హైకోర్టుకు సమర్పించిన స్టేటస్ రిపోర్టులో ఎక్కడా ∙సరైన ఆధారాలు లేవు. వారు ఫలానా చోట కలిశారని చెబుతున్నారు కానీ.. నిర్దిష్టంగాం ఎమ్మెల్యేల కొనుగోలు కోసమే కలిశారని చెప్పే ఆధారాలను చూపించడం లేదు. అక్కడ వారు కలిస్తే నేరం ఏమిటన్నది ఎవరికైనా వచ్చే మౌలికమైన సందేహం. వాట్సాప్ చాట్‌లను.. కాల్ రికార్డులను చూపిస్తున్నారు. సెల్ లొకేషన్లను సాక్ష్యాలుగా చూపిస్తున్నారు. హైకోర్టుకు సమర్పించిన వాట్సాప్ చాట్‌లో సంబంధం లేని వ్యక్తుల పేర్లతో కొన్ని సంభాషణలు ఉన్నాయి. దీంతో సిట్ విచారణ తీరు తేలిపోతోందన్న అభిప్రాయం బలపడుతోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడుగా..
మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ దూకుడు పెంచింది.. ప్రణాళికాబద్ధంగా మందుకెళ్తోంది. అమిత్ అరోరాను అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించారు. ఫోన్లు మార్చిన వైనం.. ఇతర వ్యవహారాలు చేర్చారు. ఆర్థిక లావాదేవీల అంశాన్నీ ప్రస్తావించారు. శరత్‌రెడ్డి, కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిలే ప్రధానం అని చెబుతున్నారు.

ఈడీతో పోటీ పడుతున్న సిట్..
లిక్కర్ స్కాం కేసులో నిందితులుగా పేర్కొన్న వారికి అరెస్ట్ ముప్పు కూడా పొంచి ఉంది. త్వరలోనే విచారణకు రావాలని నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాగా, లిక్కర్ స్కామ్ విచారణకు కౌంటర్‌గా సిట్‌ను దూకుడుగా ముందుకు తీసుకెళ్లాలనుకున్నా.. సాధ్యం కావడం లేదు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. ఇతర రాష్ట్రాలతో ముడిపడి ఉంది కాబట్టి తెలంగాణ పోలీసులకు అధికారం సరిపోదన్న కారణంతో హైకోర్టు సీబీఐకి ఇస్తే.. మొత్తం సీన్ మారిపోతుంది. అందుకే ఈ విచారణల్లో తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి అందరిలో నెలకొంది.