కొత్త సంవత్సరం పూట తెలంగాణలోని నాయిబ్రాహ్మణులు, రచకులకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు అందించబోతోంది. సెలూన్లు, ధోబీఘాట్లకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్‌ను అందించబోతోంది. ఇప్పటికే క్షేత్రస్థాయి నుంచి సెలూన్లు, ధోబీ ఘాట్లకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని డిస్కమ్‌లు తెప్పించుకున్నాయి. దీనిపై సీఎం కేసీఆర్‌కు నివేదించిన తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నాయి.
Also Read: ఫామ్‌హౌస్ సీఎం ఎక్కడ..?: ఇదే ఇప్పుడు బీజేపీ అస్త్రం
డిసెంబరు నుంచి సెలూన్లు, ధోబీ ఘాట్లు/లాండ్రీలకు ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేస్తామని టీఆర్‌ఎస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. వాస్తవానికి సీఎం కేసీఆర్ ఇప్పటికే ఈ ప్రకటనకు ఆమోదం తెలపాల్సి ఉండగా.. ఆయన అందుబాటులో లేకపోవడంతో పెండింగ్‌లో పడింది. ఆయన ఆమోదించాక ప్రకటన వెలువడనుంది.
ఎన్నికల ముందు ప్రతినెలా 300 యూనిట్ల దాకా సెలూన్లు, ధోబీ ఘాట్లకు ఉచిత విద్యుత్‌ను ఇవ్వడానికి ఓ ప్రతిపాదన సిద్ధం చేసింది. కానీ.. ఆ తర్వాత దానిని పక్కనపెట్టారు. తాజాగా ఏయే ప్రాంతాల్లో ఏయే సెలూన్లు ఎంత మేర విద్యుత్‌ను వినియోగిస్తున్నాయో వివరాలను సేకరించారు. ఇప్పటికే 24 లక్షలకు పైగా ఉన్న వ్యవసాయ పంపుసెట్లకు ఉచితంగా కరెంట్ ఇస్తుండగా.. 101 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించే ఎస్సీ, ఎస్టీ వర్గాలకూ ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నారు. తాజాగా క్షురకులు, రజకులు కూడా ఈ జాబితాలో చేరనున్నారు.
Also Read: తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఈ సంవత్సరం పాఠశాలలు లేనట్లే..?
మరోవైపు.. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆయా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఎప్పుడో ఎన్నికల వేళ ఇచ్చిన హామీ ఇప్పటికైనా అమలు కాబోతోంది అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొత్త సంవత్సరం వేళ ఇది తమకు తీపి కబురేనంటూ చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్