CM Jagan Strategies : ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. అన్ని పార్టీలు గెలుపు కోసం వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల మార్పు ద్వారా జగన్ గట్టి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే చేతులు కలిపిన చంద్రబాబు, పవన్ లు సీట్ల సర్దుబాటు పై ఫోకస్ పెట్టారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి, వామపక్షాలు సైతం శరవేగంగా పావులు కదుపుతున్నాయి. బిజెపి అనుసరించే వ్యూహం అనుగుణంగా కాంగ్రెస్, వామపక్షాలు అడుగులు వేయనున్నాయి. టిడిపి, జనసేనతో బిజెపి కలిస్తే.. కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పోటీ చేయనున్నాయి. బిజెపి చేరకుంటే మాత్రం ఆ స్థానాన్ని తాము భర్తీ చేయనున్నాయి.
తెలుగుదేశం, జనసేన దూకుడు మీద ఉన్నాయి. వరుసగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. చంద్రబాబు వ్యూహాల మీద వ్యూహాలు పొందుతున్నారు. జనసేనతో పొత్తు పెట్టుకోవడంతో పాటు బిజెపి కోసం ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ను తన వైపు తిప్పుకున్నారు. నారా లోకేష్ పాదయాత్ర సక్సెస్ ఫుల్ గా పూర్తయింది. జనసేనకు ఇవ్వబోయే స్థానాల విషయంలో ఎటువంటి వివాదాలు లేకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి అభ్యర్థులను మార్చుతుండడంతో అసంతృప్తులను గాలం వేసేందుకు చంద్రబాబు రకరకాల ప్రయత్నాలు ప్రారంభించారు. చివరకు వైఎస్ కుటుంబంలో ఉన్న విభేదాలను సైతం సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ షర్మిల నారా కుటుంబానికి క్రిస్మస్ గిఫ్ట్స్ పంపించి గట్టి సంకేతాలు పంపించారు.
అయితే జగన్ అంత ఈజీగా తన పట్టును వదులుకుంటారా? నో ఛాన్స్ అన్న ప్రశ్న వినిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 80 మంది అభ్యర్థులను మార్చేందుకు ఆయన సిద్ధపడుతున్నారు. అందులో కొందరికి స్థానచలనం కల్పించాలని చూస్తున్నారు. అయితే ఇది సాహసంతో కూడుకున్న పని అయినా.. బిజెపి అనుసరిస్తున్న ఫార్ములానే జగన్ కొనసాగిస్తున్నారు. బిజెపి వివిధ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చి విజయం సాధించింది. వచ్చే ఎన్నికల్లో 100 మంది ఎంపీ అభ్యర్థులను మార్చనున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పుడు అదే ఫార్ములా ను జగన్ అనుసరిస్తున్నారు. పక్క వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఎంపీలను ఎమ్మెల్యేలుగా.. ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీ చేయించేందుకు ఆలోచన చేస్తున్నారు. ఎటువంటి పట్టింపులకు పోకుండా సొంత వారిని సైతం పక్కన పెట్టేందుకు జగన్ స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు.
విపక్షాలకు ఒక లెక్క ఉంటే.. జగన్ కు ఇంకో లెక్క ఉంది. పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చడం ద్వారా ఎంతటి సాహసానికైనా జగన్ దిగుతారని సంకేతాలు పంపించారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలకు మించి తాను ప్రకటిస్తానని చెప్పుకొస్తున్నారు. టిడిపి, జనసేన కూటమిలోకి బిజెపిని తేవాలని చంద్రబాబు భావిస్తుంటే.. దానిని అడ్డుకుంటూ వస్తున్నారు. టిడిపి, జనసేన మధ్య పొత్తు కుదిరినా.. సీట్ల సర్దుబాటు వద్ద మడత పేచీ వస్తుందని భావిస్తున్నారు. ఓట్ల బదలాయింపు అంత సవ్యంగా జరగకుండా తన ప్రయత్నాలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలను పెంచాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఎదిరించి పార్టీని పెట్టారు. కాంగ్రెస్ ను నామరూపాలు లేకుండా చేయడంతో పాటు తాను అనుకున్నది సాధించగలిగారు. అటువంటి జగన్ తప్పటడుగులు వేయరని.. ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.