CM Jagan On Chandrababu: చంద్రబాబు అరెస్ట్ ను కేంద్రంపై నెట్టే ప్రయత్నం జరుగుతోందా? కేంద్ర పెద్దలకు తెలిసే ఈ అరెస్టు జరిగిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీ సీఎం జగన్ ఇదే మాట చెబుతుండడంతో అనుమానాలకు బలం చేకూరుతోంది. కేసు దర్యాప్తు చేసింది సిఐడి. ఇప్పటికే ఈ కేసు బయటికి తీసింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ. అందుకే జగన్ కేంద్ర ప్రభుత్వ చొరవతోనే చంద్రబాబు అరెస్టు జరిగిందని కొత్త నినాదం ప్రారంభించారు. అయితే ఇది వ్యూహాత్మకంగా చేసిందా? లేక ఆ ప్రభావం తమపై ఉండకూడదన్న కోణంలో చేసిందా? అన్నది తెలియాల్సి ఉంది.
అయితే ఏపీ సీఎం జగన్ చంద్రబాబు అరెస్టుపై విభిన్నంగా స్పందిస్తూ వస్తున్నారు. తొలుత చంద్రబాబు అరెస్టుతో మాకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. మరోసారి పక్కా ఆధారాలతో దొరకడం వల్లే చంద్రబాబును అరెస్టు చేశారని ప్రకటించారు. చంద్రబాబు అరెస్టుతో నాకు సంబంధం లేదు.. ఆ సమయంలో నేను లండన్ లో ఉన్నానంటూ మరోసారి వెల్లడించారు. చంద్రబాబు బయట కంటే జైలులో ఉండడమే బెటర్ అని మరోసారి చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాజాగా కేసుతో తమకు సంబంధమే లేదని.. చంద్రబాబుపై ఎలాంటి కక్ష లేదన్నారు. కేంద్ర దర్యాప్తు చేసి నిజాలు బయట పెట్టడం వల్లే చంద్రబాబు అరెస్టయ్యారని తాజాగా చెబుతున్నారు. గత ఎన్నికలకు ముందే చంద్రబాబు అవినీతి విషయాలు తెలుసుకొని ఈడి ఎంటర్ అయిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదంతా ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కే తెలిసే జరిగిందని సంకేతాలు ఇచ్చారు.
అయితే తాజాగా చంద్రబాబు అరెస్టు విషయంలో జగన్ రూటు మార్చడం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు అరెస్టుతో సానుభూతి లభిస్తుందని టిడిపి ఆశిస్తోంది. కానీ అంతలా లేదని వైసిపి భావిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో చంద్రబాబు అరెస్టు ప్రభావం అధికార వైసిపి పై పడుతుందని జగన్కు తెలుసు. అందుకే దానిని అధిగమించేందుకే ఇలా ప్రకటన చేసి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల ముంగిట రిస్క్ చేయడం కొంత ప్రతికూల అంశమే. అయినా సరే జగన్ రిస్క్ కే ప్రాధాన్యమిచ్చారు.చంద్రబాబును అరెస్టు చేయించారు.30 రోజులు పాటు జైలులో ఉంచగలిగారు. తాను అనుకున్నది సాధించుకున్నారు. రాజకీయ ప్రతికూల అంశంగా మారుతుందని తెలిసి కేంద్ర పెద్దలపై ఈ నెపాన్ని వేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదిరింది. బిజెపి ఈ కూటమిలో చేరుతుందని ఊహాగానాలు వస్తున్నాయి.తాజాగా సీఎం జగన్ వ్యాఖ్యలుబిజెపికి ప్రతికూలతగా మారుతాయి అని.. ఆ మూడు పార్టీల మధ్య గ్యాప్ వచ్చేందుకే ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో కేంద్ర పెద్దల పాత్ర ఉందన్న అనుమానాలు ఉన్నాయి. దానికి మరింత బలం చేకూర్చేలా జగన్ వ్యాఖ్యానించారు. దీంతో బిజెపితో టిడిపి,జనసేన లకు అంతర్యుద్ధం ప్రారంభం అవుతుందని.. ఒకవేళ పొత్తు కుదుర్చుకున్నా అనుకున్న ఫలితాలు రావని.. అందుకే జగన్ చంద్రబాబు అరెస్టు నేపధ్యాన్ని కేంద్ర పెద్దలపై వేయడంలో సక్సెస్ అయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు.