CM Jagan Guntur Visit: ఏదైనా జిల్లాకు ముఖ్యమంత్రి జగన్ వస్తున్నారంటే ఆ ప్రాంతవాసులు హడాలిపోతున్నారు. అధికారులు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. శుక్రవారం గుంటూరు జిల్లాలో ఆయన పర్యటన జరిగింది. రెండు రోజులు ముందుకుగానే నగరంలో హడావుడి మొదలుపెట్టేశారు. ఆయన పర్యటించే ప్రాంతాలన్నీ పరదాలతో చుట్టేశారు. బారికేడ్లు అడ్డుపెట్టేసి ట్రాఫిక్ ను పూర్తి స్థాయిలో నిలువరించారు. అత్యవసర పనులు, ఆఫీసులకు వెళ్లేవారు పడిన ఇబ్బందులు అంతా ఇంతా కాదు.
గుంటూరు నగరంలో చుట్టుగుంట సెంటర్ లో జగన్ కార్యక్రమ ఏర్పాట్లను చేశారు. వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద రూ.361.29 కోట్ల విలువ గల 2,562 ట్రాక్టరు్ల, 100 హార్వెస్టర్లు, 13,573 ఇతర వ్యవసాయ పరికరాలను ఆయన అందజేశారు. అనంతరం రైతులకు రాయితీ నగదు వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ట్రాక్టర్ ను నడిపి జగన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కాగా, జగన్ ప్రయాణించే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా భారీగా పరదాలను అడ్డుపెట్టారు. ట్రాఫిక్ ను దారిమళ్లించారు. కార్యక్రమం జరుగుతున్న చుట్టుగుంట ప్రాంతంలో అపార్ట్ మెంట్లు ఎక్కువ. వాటన్నింటికీ వైఎస్సార్ పార్టీ జెండా రంగులతో ఉన్న పరదాలను చుట్టేశారు. ఇళ్లలో వారెవరినీ బటయకు రానివ్వలేదు. కనీసం ముఖ్యమంత్రి జగన్ ను చూసే భాగ్యం కూడా కల్పించలేదు. ముఖ్యమంత్రి పంపిణీ చేయనున్న ట్రాక్టర్లను గురువారం రాత్రే నగరానికి రప్పించారు. ఉదయం 6 గంటలకు ట్రాక్టర్లపై కూర్చోవాలని ఆదేశాలు జారీ చేశారు. 9 గంటలకే ఎండ మండిపోతున్నా, జగన్ వచ్చి ప్రారంభం చేసేవరకు వారంతా అలాగే కూర్చొని ఉండిపోయారు.
గుంటూరువాసులకు ఆద్యంతం చుక్కలు చూపిన పర్యటన, జగన్ వెనుతిరిగిన తరువాత కూడా టెన్షన్ వాతావరణం వీడలేదు. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇంట్లోకి ఎప్పుడు బయటకు వచ్చేందుకు అవకాశం కల్పిస్తారా అని స్థానికులు ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే, పరదాలను అపార్ట్ మెంట్లకు తొలగించకపోవడంతో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎవరైనా తొలగిస్తే అధికారులు, నాయకులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారేమోనని మిన్నకుండిపోయారు.