CM Jagan Three Capital Issue: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలను నానా తిప్పలు పెడుతోంది. సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చినా అభివృద్ధి పనులు మాత్రం చేపట్టడం లేదు. దీంతో ప్రజాగ్రహానికి గురవుతోంది. ఇక మూడు రాజధానుల వ్యవహారం సర్కారు మెడకు పాములా చుట్టుకుంటోంది. మూడు రాజధానుల పై ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి ఇతర విషయాల మీద లేదు. అభివృద్ధిపై అసలే లేదు. దీంతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి కానరావడం లేదు.
మరోవైపు మూడు రాజధానులు కడతామని ప్రభుత్వం చెబుతున్నా ప్రస్తుతం ఖజానా లేకున్నా మూడు రాజధానులు ఎలా కడతారనే ప్రశ్న వస్తోంది. కోర్టు సైతం అక్షింతలు వేసినా వైసీపీ ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులకే ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా లబ్ధిపొందేందుకే మూడు రాజధానుల విషయం ముంగిటకు తెస్తోంది. ప్రాంతాల మధ్య విద్వేషాలు రగుల్చుతోంది.
అధికార పార్టీ వైసీపీ మాయలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లుగా పరిపాలన చేస్తున్నా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టకపోయినా నిత్యం ప్రజావ్యతిరేక పనులు చేస్తూ కోర్టుల చేత చీవాట్లు తినడం సర్కారుకు మామూలుగా మారిపోయింది. ప్రభుత్వంపై వందల కేసులు కోర్టుల్లోనే పెండింగులో ఉన్నాయి. దీంతో ప్రజల్లో కూడా వైసీపీపై అసహ్యం పెరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి పరాభవం తప్పదనే వాదన కూడా వస్తోంది.
పేదల పక్షాన నిలవాల్సిన ప్రభుత్వం వారి సంక్షేమానికి పాటుపడాల్సింది పోయి వారికి వ్యతిరేక చర్యలు తీసుకుంటూ వారి చేతే శాపనార్థాలు పెట్టించుకుంటోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల తీరు కూడా జుగుస్సాకరంగా ఉంటోంది. వారు మాట్లాడే భాషలో కూడా బూతులే ఉండటం తెలిసిందే. దీంతో భవిష్యత్ లో వారికి ఎదురుదెబ్బలే మిగలనున్నాయని చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ఏపీ ఆర్థిక స్థితి మరింత దిగజారిపోయింది. దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు లాగా అప్పులతో నెట్టుకు రావాల్సి వస్తోంది. దీంతో భవిష్యత్ లో కూడా సర్కారు కొలువు దీరితే ప్రభుత్వాన్ని నడపడం కష్టమేనని చెబుతున్నారు. ఈ క్రమంలో మూడు రాజధానుల వ్యవహారాన్ని ముందు పెట్టి ఎన్నికలకు వెళ్లేందుకు సర్కారు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అసలే ఖజానా లేకపోవడంతో మూడు రాజధానులు ఎలా కడతారనే ప్రశ్నలు కూడా అందరిలో వస్తున్నాయి. ఇదే విషయంలో జనం నిలదీస్తే ఏం సమాధానం చెబుతారనే విషయం కూడా ప్రచారం సాగుతోంది.