
కరోనా రాకతో రెండు నెలలపాటు పక్కరాష్ట్రంలోని జూబ్లీహిల్స్ లోని తన సొంతింట్లో కడుపులో చల్ల కదలకుండా ఉన్న ఏపీ ప్రతిపక్ష నేత ఎట్టకేలకు లాక్ డౌన్ సడలింపులతో ఏపీకి వచ్చారు. కొద్దిరోజులు హడావుడి చేసి మళ్లీ హైదరాబాద్ లోని తన నివాసానికి కొడుకు లోకేష్ తో సహా వెళ్లిపోయాడు. హైదరాబాద్ వెళ్లిన చంద్రబాబును ప్రశాంతంగా ఉండనీయడం లేదు జగన్. తాజాగా మళ్లీ అమరావతి నివాసానికి చంద్రబాబును రప్పించేలా చేస్తున్నాడు.
ఏపీ సీఎం జగన్ టీడీపీ నేతలను వేటాడేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా తనను ముప్పుతిప్పలు పెట్టిన వారిని ఏరేస్తున్నారు. తాజాగా వైఎస్ జగన్ సర్కార్ టీడీపీ ముఖ్య నాయకులను ఒకేరోజు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు, జేసీ ట్రావెల్స్ మోసంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో మీడియా ఫోకస్ అంతా టీడీపీపై పడింది. టీడీపీ నేతలు, శ్రేణులంతా షాక్ కు గురై ఆందోళనలో ఉన్నారు.
ఇద్దరు దిగ్గజ టీడీపీ నేతల అరెస్ట్ టీడీపీ నాయకులు, క్యాడర్ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నందున హైదరాబాద్ నుంచి టీడీపీ కార్యకలాపాలను కొనసాగిస్తున్న చంద్రబాబు ఇక ఇక్కడి నుంచి నిర్వహించలేమని గ్రహించినట్టు తెలిసింది. ఏపీకి రాక తప్పని పరిస్థితిని జగన్ కల్పించారని అర్థమవుతోంది. దీంతో ఈ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి అమరావతికి బయలుదేరారు. సాయంత్రం 4 గంటలకు అమరావతికి చంద్రబాబు చేరుకుంటారు.
14 రోజుల రిమాండ్ తో జైలు పాలై..గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడును చంద్రబాబు పరామర్శించే అవకాశం ఉంది. ఈ మేరకు విజయవాడ జైలు సూపరింటెండెంట్, జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ ను చంద్రబాబు అనుమతి కోరారు.
ఇక చంద్రబాబు కుమారుడు నారాలోకేష్ అనంతపురం బయలు దేరాడు.టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబసభ్యులను లోకేష్ పరామర్శించనున్నాడు. అనంతపురంలో జేసీ అరెస్ట్ కు నిరసనగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సమాచారం.
ఇలా తండ్రీకొడుకులు చంద్రబాబు-లోకేష్ లు హైదరాబాద్ లో ఉండి ఏపీలో పార్టీ కార్యక్రమాలు ఇన్నాళ్లు పర్యవేక్షించారు. కానీ నేడు ఇద్దరు టీడీపీ నేతల అరెస్ట్ తో వారిని వైఎస్ జగన్ సొంత రాష్ట్రానికి రప్పిస్తుండడం విశేషంగా మారింది.