
దేశాన్ని పాలిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేతులెత్తేసింది.. కరోనా-లాక్ డౌన్ తో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టలేకపోయింది. ఆదాయం లేక దేశ ఖజానా ఖాళీ అయ్యింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన ప్రకటన చేసింది. కొత్త పథకాలు ఇకపై ఉండవని.. భవిష్యత్తులోనూ రూపొందించే ప్రసక్తి లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో పొదుపు చర్యల్లో భాగంగా ఖర్చును తగ్గించుకునే క్రమంలో ఈ ఏడాది ఎలాంటి కొత్త పథకాలు అమలు చేయమని కేంద్ర ఆర్థిక శాఖ కుండబద్దలు కొట్టింది.
కొత్త పథకాలకు రాంరాం పలికిన కేంద్రం ఉన్న వాటిని కూడా రాష్ట్రాలకే అప్పగించి వాటిపై భారం మోపడంపై అన్ని రాష్ట్రాల సీఎంలు మండిపడుతున్నారు. ఈ ఫిబ్రవరిలో మోడీ సర్కార్ బడ్జెట్ లో ప్రకటించిన కేంద్రం పథకాలన్నీ మార్చి 31వ తేదీ వరకే ఆపేస్తున్నామని.. బడ్జెట్ లో ఈ ఏడాది ప్రకటించిన ఏ కొత్త పథకాలు ఇక నుంచి కొనసాగించమని కేంద్రం చేసిన ప్రకటన అందరినీ అవాక్కయ్యేలా చేసింది.
కేంద్రం చేతులెత్తేసినా ఏపీ సీఎం జగన్ మాత్రం మొండి ధైర్యంతో ఏపీ ప్రజలకు సేవలందించేందుకు ముందుకెళ్తుతున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పోలిస్తే సీఎం జగన్ ను మెచ్చుకోకుండా ఎవరూ ఉండలేరు. ఒకవైపు కరోనా విపత్తు ఉన్నా దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తూ ఏపీని శిఖరాగ్రాన జగన్ నిలిపారు. మరోవైపు లోటు బడ్జెట్ వెక్కిరిస్తున్నా.. ఏపీ ప్రజలకు తాను ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాల విషయంలో ఎలాంటి లోటు రాకుండా ముందుకు వెళుతున్నారు.కరోనా విపత్తుతో సంబంధం లేకుండా ఇంతటి కష్టకాలంలోనూ జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఏపీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ వారి మనసులు దోచుకుంటున్నారు.
ఇంతటి కరువులో పక్కరాష్ట్రంలో తెలంగాణలో ఉద్యోగులకు సగం జీతాలిస్తున్నారు దేశంలోనే ధనిక రాష్ట్రం సీఎం కేసీఆర్. కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం ఫుల్ జీతాలు ఇస్తూ నిన్నటికి నిన్న వాహనమిత్ర పథకం కింద ఏకంగా డ్రైవర్లకు రూ.10వేలు చొప్పున వారి ఖాతాల్లో జమ చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు.
కేంద్రం తన నిధులను పొదుపుగా వాడుకుంటూ బడ్జెట్ లో మార్చిలో ప్రకటించిన కొత్త పథకాలకు కూడా మంగళం పాడి ఆడిన మాట తప్పింది. కానీ కేంద్రం, తెలంగాణ కంటే దుర్భర లోటు బడ్జెట్ లో ఉన్న ఏపీ ఆర్థిక వ్యవస్థకు వెరవకుండా సీఎం జగన్ నవరత్నాలతోపాటు మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. ఎక్కడా ఎవరికి కోత రాకుండా పేదలకు ఇంతటి విపత్తులోనూ పథకాలను అందిస్తుండడం చూసి దేశమే ఆశ్చర్యపోతోంది. జగన్ పాలనతీరుకు ప్రశంసలు కురిపిస్తోంది. కరోనా విపత్తు సమయంలోనూ సీఎం జగన్ సంక్షేమ క్యాలెండర్ ను రిలీజ్ చేసి తాను హామీనిచ్చిన ఏ పథకాన్ని జాప్యం చేయకుండా అమలుకు కంకణం కట్టుకున్న తీరు చూసి సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
–నరేశ్ ఎన్నం