CM Jagan: ఏపీలో సంక్షేమమనే తారకమంత్రాన్ని అన్ని పార్టీలు పఠిస్తున్నాయి. రకరకాల హామీలతో ప్రజల మనసును గెలుచుకోవాలని చూస్తున్నాయి. అధికారంలోకి రావాలంటే సంక్షేమమే కీలకంగా భావిస్తున్నాయి. ఇప్పటికే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న జగన్ మరోసారి అధికారం వస్తుందన్న ధీమాతో ఉన్నారు. ఈ రెండు నెలల పాటు కీలక పథకాలకు శ్రీకారం చుట్టి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. అందులో భాగంగా జనవరి ఒకటి నుంచి కానీ.. సంక్రాంతి నుంచి కానీ మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టాలని బలమైన ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ప్రధాన కారణం మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం. అధికార బిజెపిని మట్టి కరిపించేందుకు ఈ తరహా పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దీంతో మహిళలు విపరీతంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ఫలితంగా అక్కడ పార్టీ అధికారంలోకి రాగలిగింది. అటు తర్వాత వచ్చిన తెలంగాణ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం హామీని ఇచ్చింది. అక్కడ కూడా మహిళలు కాంగ్రెస్ ను అక్కున చేర్చుకున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీని ఇచ్చేందుకు చంద్రబాబు ముందుకు వచ్చారు. లోకేష్ పాదయాత్ర ముగింపు సభలో ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణం పై కీలక ప్రకటన చేశారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చుతామని వెల్లడించారు.
అయితే ఈ ఉచిత ప్రయాణ పథకం విపక్షాలకు ఎక్కడ రాజకీయ లబ్ధి చేకూర్చుతోందన్న ఆందోళనలో అధికార పార్టీ ఉంది. అందుకే అంతకంటే ముందే తాను ఈ పథకానికి శ్రీకారం చుట్టాలని జగన్ భావిస్తున్నారు. కానీ ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. దీంతో చాలా రకాల రాయితీలకు దూరమయ్యామని ఆర్టీసీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఉద్యోగులకే నెలకు రూ. 230 నుంచి రూ.240 కోట్లు జీతాల రూపంలో చెల్లిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆర్టీసీకి రోజుకు సగటున రూ. 17 కోట్ల వరకు ఆదాయం వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే రాబడి తగ్గడంతో పాటు.. ఆర్టీసీ మనుగడకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని అధికారులు తేల్చి చెబుతున్నట్లు సమాచారం. రోజుకు సగటున ఆర్టీసీ బస్సుల్లో 40 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. వీరిలో 15 లక్షల వరకు మహిళలు ఉంటారని అంచనా. అదే జరిగితే వీరి రూపంలో వస్తున్న ఆదాయానికి గండి పడినట్టే. అందుకే ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని అధికారులు ఒక నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
ఇప్పటికే ఆర్టీసీ లో ఉచిత ప్రయాణానికి సంబంధించి సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆర్టీసీకి ఆదాయం తగ్గడంతో పాటు ప్రైవేటు వాహనదారుల నుంచి, ఆటో డ్రైవర్ల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల ముంగిట ఈ తరహా ప్రయోగం వర్క్ అవుట్ కాదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ దీనిని అమలు చేస్తే మహిళలు తరుణ్ అయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రైవేటు వాహనదారులు, ఆటో డ్రైవర్లు ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత చూపి అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం పై ప్రభుత్వం నిర్దిష్ట ప్రకటన చేయడం లేదు. కానీ అమలు చేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దీనిపై ఒకటి రెండు రోజుల్లో సీఎం జగన్ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.