కరోనా కల్లోలంతో నెలల తరబడి లాక్ డౌన్, కర్ఫ్యూలతో ఇంటికే పరిమితమైన ప్రజలకు ఇప్పటికైనా తమకు ఉపశమనం ఇచ్చేలా బయటకు రావాలన్న కోరిక అందరిలో ఉంటోంది. సంవత్సరకాలంగా కరోనాతో ప్రజలు పడ్డ బాధల నుంచి ఇఫ్పుడిప్పుడే ఉపశమనం లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ తగ్గడంతో ప్రజలు , ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.
ఏపీ ప్రభుత్వం కూడా ప్రజలకు ఊరటనిచ్చేలా నిర్ణయం తీసుకుంది. చాలా రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్నా కర్ఫ్యూ వేళలను ఏపీ ప్రభుత్వం సడలించింది. కరోనా పరిస్థితులపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ప్రజలకు సడలింపులు ఇస్తూ గొప్ప 5 ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో ఇప్పటివరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపులు ఉన్నాయి. తాజాగా ఆ సమయాన్ని సాయంత్రం 6 గంటలకు పెంచారు. దీంతో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. ఇక రాష్ట్రంలో దుకాణాలు మాత్రం సాయంత్రం 5 గంటలకే మూతపడనున్నాయి. కర్ఫ్యూ సడలింపులతో ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేయనున్నాయి.
సడలించిన వేళలు ఈనెల 21 నుంచి 30 వరకు అమల్లో ఉండనున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం కేసులు అధికంగా ఉండటంతో ఆ జిల్లాలో మధ్యాహ్నం 2 గంటలకే సడలింపు కొనసాగనుంది. ఈ మేరకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.