ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాల హవా కొనసాగుతోంది. జగన్ ప్రభుత్వం పేద వర్గాలకు చేయూత పథకం ద్వారా అందిస్తున్న సాయంతో అందరిలో హర్షం వ్యక్తం అవుతోంది. చేయూత పథకం ద్వారా ప్రతి మహిళ కు ఏటా రూ.15 వేలు అందిస్తామని వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. అయితే ఒక ఏడాది ఆలస్యం కావడంతో రూ.18,750 చొప్పున నాలుగేశ్లు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వం ఏటా రూ.4300 కోట్లు ఖర్చు చేయనుంది.
తొలివిడతగా 20 లక్షల మందికి నిధులు ఖాతాలో జమ చేశారు. ఈ ఏడాది ఇరవై ఒక్క లక్షల మంది ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు తెలిపింది. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న పేద వర్గాలకు ఈ పథకం వరమవుతోంది. కేవలం డబ్బులు ఖాతాల్లో వేయడం కాకుండా వాటి ద్వారా ప్రజలు ఉపాధి పెంచుకునే మార్గాలు చూపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది.
రూ.18,750తో మహిళలు కిరాణాదుకాణాలతోపాటు గేదెలు, ఆవులు, మేకలు లాంటి జీవనోపాధి మార్గాలను ఏర్పాటు చేసుకునేందుకు సాయం చేస్తోంది. బ్యాంకుల ద్వారా ముందే రుణాలు తీసుకుంటే అవి ప్రభుత్వం చెల్లించేలా ఒప్పందం చేసుకుంటున్నారు. తొలి విడత లబ్ధిదారుల్లో 78 వేల మంది కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. మరో రెండు లక్షల మంది ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం ప్రారంభించాలని ప్రభుత్వం చెబుతోంది.
అవసరాలకు అప్పులు చేయాల్సిన పరిస్థితిఉన్నా హామీల అమలులో ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదు. ఇప్పటికే పలు కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సాయం అందిస్తూనే ఉంది. మహిళల బతుకులు బాగు చేసేలా ప్రయత్నాలు ప్రారంభించింది. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయని పలు విమర్శలు వస్తున్నా పట్టిచంచుకోవడం లేదు. చేయూత పథకం ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేయడం గమనార్హం.