CM Jagan- Three Capitals Issue: కోర్టుల తీర్పు విషయంలో వైసీపీ నేతలది విచిత్ర వాదన. అనుకూలంగా తీర్పు వస్తే సంబరపడతారు. సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తారు. అదే వ్యతిరేకంగా జడ్జిమెంట్ వచ్చినా.. ఏ మాత్రం ప్రతికూలంగా తీర్పు వచ్చినా ఏకంగా న్యాయవ్యవస్థనే తప్పుపడతారు. సోషల్ మీడియాలో జడ్జిల పై అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. రెండు రోజుల కిందట అమరావతి రాజధాని విషయంలో వాద, ప్రతివాదనల సమయంలో న్యాయమూర్తి లేవనెత్తిన చిన్నపాటి అభిప్రాయాన్ని తీర్పుగా మలిచి మరీ తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు. అచ్చం మేము తీసుకున్న నిర్ణయానికి దగ్గరగా ఉందని సమర్థించుకుంటున్నారు. సాక్షితో పాటు వైసీపీకి అనుకూలంగా ఉండే కూలి మీడియా అయితే ప్రచారంతో హోరెత్తిస్తోంది. న్యాయ వ్యవస్థపై ఎన్నడూ గౌరవం చూపని ఏపీలోని అధికార పార్టీ నేతలు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు.

రాజధాని విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సవ్యంగా చెప్పడానికి, చూపడానికి వైసీపీ నేతలు ఏ మాత్రం ఇష్టపడడం లేదు.ఈ విషయంలో ఒక ప్రత్యేక అజెండాతో ముందుకెళుతున్నట్టు మాత్రం తెలుస్తోంది. సుప్రీం కోర్టు తీర్పుపై జగన్ అనుంగ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి అయితే రకరకాలుగా విశ్లేషణలు చెబుతున్నారు. తీర్పు తమకు అనుకూలంగా వచ్చింది కాబట్టి బిల్లు మరింత పటిష్టంగారూపొందించి సభలో పెడతామని ప్రకటించారు. చట్టసభలు నడిపే..ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ అయిన తమ్మినేని సీతారాం ఒక అడుగు ముందుకేసి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఇక స్వేచ్ఛగా బిల్లు పెట్టడమే తరువాయి అన్నవిధంగా కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే పరిశీలిస్తే మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ నేతలు ఒక పద్ధతి ప్రకారం ప్రచారం ఉధృతం చేస్తున్నట్టు తెలుస్తోంది. సుప్రీం కోర్టులో జస్టిస్ నాగరత్న వాదనల సమయంలో ప్రభుత్వాలను చట్టాలు చేయకుండా చేయలేం కదా? అని ప్రశ్నించారు. దీనిపై రైతుల తరుపున న్యాయవాది శ్యాందివాన్ తన వాదనలు వినిపించారు. అయితే జస్టిస్ న్యాయరత్న నుంచి వచ్చిన ప్రభుత్వాలను చట్టాలు చేయకుండా చూడలేం అన్న పాయింట్ ను వైసీపీ నేతలు క్యాచ్ చేశారు. తీర్పులో ఆ పాయింట్ ప్రస్తావన లేకున్నా.. వైసీపీ నేతలు మాత్రం తమకు అనుకూలంగా అన్వయించుకున్నారు. ప్రచారం మొదలు పెట్టేశారు. అటు తమ అనుకూల మీడియాలో దుమ్మురేపుతున్నారు. మరింత కన్ఫ్యూజన్ కు అవకాశమిచ్చేలా మూడు రాజధానులకు మద్దతుగా బిల్లు ప్రవేశపెట్టనున్నట్టు చెబుతున్నారు.

సుప్రీం కోర్టు విచారణ తరువాత… వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. కనీస అవగాహన ఉన్నవారికి ఇది అర్ధమవుతుంది. తాము చెప్పిందే సుప్రీం కోర్టు తీర్పు అన్నట్టు అధికార పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. వాస్తవానికి సుప్రీం కోర్టు ఏం చెప్పిందో.. చెప్పడానికి మాత్రం వారు అంగీకరించడం లేదు. కనీసం ఆ మాట వినేందుకు కూడా ఇష్టపడడం లేదు. కానీ మూడు రాజధానులకు మద్దతుగా బిల్లు ప్రవేశపెట్టేందుకు మాత్రం పర్మిషన్ ఇచ్చిందని చెబుతున్నారు. అయితే ఇప్పటికే జగన్ అండ్ కో ఒక స్థిర నిశ్చయానికి వచ్చింది. కోర్టు ధిక్కరణ చేసైనా మూడు రాజధానులకు మద్దతుగా ముందుకు పోవడాలని డిసైడ్ అయ్యారు. అప్పటికి కోర్టు ఎలాగూ అడ్డుకుంటుంది. అందుకే మేము మూడు రాజధానులు చేయలేకపోయామని చెప్పుకోవడానికి అదో మార్గంగా భావిస్తున్నారు. రాజధాని లేని రాష్ట్రంగా తయారుచేశారన్న అపవాదు నుంచి జగన్ అండ్ కో ఈ కొత్త ఎత్తుగడ వేశారని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.