రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. అవసరమైతే అందలాలు ఎక్కిస్తారు. లేదంటే పట్టించుకోరు. ఇచ్చిన హామీలు మరిచిపోతుంటారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు విస్తు గొలుపుతున్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నలుగురు వైసీపీ నాయకులు గత ఎన్నికల సమయంలో టికెట్లు ఇవ్వకున్నా అధినేత మాటతో వారు పార్టీని గెలిపించి వారిలోని విశ్వాసం నిరూపించుకున్నారు. కానీ అధినేత మాత్రం వారి గురించి మరిచిపోయారు. వారికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు సరికదా ఇప్పటి వరకు అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయినా వారి గురించి పట్టించుకోవడం మానేశారు. దీంతో వారిలో అసహనం పెరిగిపోతోంది.
టీడీపీకి కంచుకోటగా ఉన్న వినుకొండ నియోజకవర్గంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న జీవీ ఆంజనేయులును ఓడించేందుకు వైసీపీ కీలక అస్ర్తం ప్రయోగించింది. గత ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ఈయనను ముందు పెట్టి ఇక్కడ రాజకీయం నడిపించారు. వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు గెలుపొందారు. ఎన్నికల సమయంలో నామినేటెడ్ పదవి కానీ ఎమ్మెల్సీ కానీ ఇస్తామని ఆశపెట్టినా తరువాత పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.
పొన్నూరులో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర విజయం సాధించారు. ఇక్కడ రావి వెంకటరమణను వాడుకున్న వైసీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా ఆయనను ఇక్కడ ఇన్ చార్జిగా నియమించింది. జగన్(CM Jagan) పార్టీ పెట్టినప్పటి నుంచి కిలారు రోశయ్యకు టికెట్ కేటాయించేవారు. రోశయ్య గెలుపుకు రావి పాటుపడేవారు. కానీ జగన్ ఆయనను పట్టించుకోలేదు. చివరకు నామినేటెడ్ పదవులు ఇచ్చినా రావికి మాత్రం పదవి దక్కలేదు.
మరో నేత దేవినేని మల్లికార్జున రావును కూడా పార్టీ కోసం బాగానే వాడుకున్నారు. కానీ పదవుల పంపిణీలో మాత్రం ఆయనకు పెద్దపీట వేయలేదు. దీంతో ఆయన కినుక వహించారు. చిలుకలూరిపేట నియోజకవర్గంలో టికెట్ త్యాగం చేసిన మర్రి రాజశేఖర్ రెడ్డికి పార్టీ పదవి ఇస్తారని భావించినా ఆచరణలో మాత్రం కనిపించలేదు. ఈ నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలకు జగన్ మొండిచేయి చూపారని చర్చ జరుగుతోంది.