హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణకు జగన్ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. గతంలో హిందూపురంలో మంజూరైన మెడికల్ కాలేజీని రద్దు చేసి, పెనుగొండ నియోజకవర్గానికి తరలించింది. దీంతో టీడీపీ నేత బాలకృష్ణకు పెద్ద ఝలక్ ఇచ్చింది. హిందూపురం నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం స్థలాన్ని కూడా సేకరించి, సిద్ధం చేసినప్పటికీ బాలయ్య నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు చేతులెత్తేసింది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అయితే హిందూపురం పార్లమెంటు పరిధిలో మాత్రం మెడికల్ కళాశాల ఏర్పాటుపై వివాదం నెలకొంది. హిందూపురంలో మెడికల్ కాలేజీ వివాదం తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రత్యక్ష పోరాటానికి వేదికగా మారింది.
అయితే.. హిందూపురంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడానికి గత టీడీపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ములుగూరు వద్ద మెడికల్ కళాశాల కోసం స్థల సేకరణ కూడా జరిగింది. ములుగూరులో మెడికల్ కళాశాల నిర్మాణం కోసం ఎమ్మెల్యే బాలకృష్ణ గత ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు సైతం రాశారు. హిందూపురం నియోజకవర్గంలో అన్ని వసతులతో కూడిన ప్రభుత్వాస్పత్రి ఉందని, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని గతంలో ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్న విషయాన్ని ఆ లేఖల్లో పేర్కొన్నారు.
వైసీపీ తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రెడీ అయిపోయారు టీడీపీ నేతలు. ఆందోళనలు చేసేందుకు సిద్ధమైపోతున్నారు. ఒక టీడీపీ మాత్రమే కాకుండా ప్రతిపక్ష పార్టీలను కూడా కలుపుకుపోయి మెడికల్ కాలేజీ సాధించాలని కూటమి గడుతున్నారు. స్థలాన్ని కూడా సేకరించిన తరువాత కళాశాలను ఏర్పాటు చేయకుండా ఇతర నియోజకవర్గాలకు తరలించటం సమంజసం కాదని అంటున్నారు. ఇక హిందూపురం మెడికల్ కళాశాల విషయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ అహ్మద్ కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు.
జిల్లాల పునర్విభజన కమిటీ సూచనల మేరకు మెడికల్ కళాశాలను పెనుగొండలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని మంత్రి శంకర్ నారాయణ పట్టుబట్టారు. ఫైనల్ గా మంత్రి ప్రయత్నాలు ఫలించడం పెనుగొండ సమీపంలోని మడకశిర రోడ్డులో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 59 ఎకరాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మెడికల్ కళాశాల నిర్మాణానికి అంగీకరించింది. దాని కోసం 475 కోట్ల రూపాయల నిధులను సైతం విడుదల చేసింది. త్వరలో పెనుగొండ జిల్లా ప్రధాన కేంద్రం కాబోతుందని,పెనుగొండలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు గల కారణాన్ని మంత్రి శంకర్ నారాయణ సమర్థించారు. ఏదిఏమైనా తన నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు అవుతుందనుకున్న బాలయ్య ఆశలపై జగన్ నీళ్లు చల్లారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్