CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతల తీరుపై సీఎం జగన్ దృష్టి సారించారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయిన సందర్భంగా పార్టీని గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో ప్రక్షాళన దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. నేతల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించే క్రమంలో ఆయన పలు మార్పులు తెచ్చేందుకు సిద్ధమయ్యారు. నేతల్లో దూరం పెరిగిపోతోంది. సమన్వయం కొరవడుతోంది. సహకారం మాట దేవుడెరుగు. ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించడంలో పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ప్రజాసమస్యలను గాలికొదిలేసి సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారనే అపవాదు మూటగట్టుకుంటున్నారు.

వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో నగదు బదిలీ కార్యక్రమాల ద్వారా నేరుగా వారి ఖాతాలకే మళ్లిస్తుండడంతో నేతలు ప్రజల మధ్యకు వెళ్లే అవకాశం దక్కడం లేదు. అయితే ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం కూడా రంగంలోకి దిగి ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజాభిప్రాయం తెలుసుకుంటోంది. దీంతో జగన్ కూడా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పార్లమెంట్ సభ్యులతో సమావేశమవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఎంపీలు, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం కొరవడింది. అధికశాతం మంది వైసీపీ నేతలు ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించడం లేదు. విశాఖ, నెల్లూరు, అనంతపురం, నరసరావుపేట, ఒంగోలు, కర్నూలు, హిందూపురం, నంద్యాల తదితర చోట్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ఎంపీలకు మధ్య పొసగడం లేదని తెలుస్తోంది. దీంతో జగన్ వారి మధ్య సమన్వయం అన్వయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
మరోవైపు ఎంపీ లాడ్స్ నిధులు కూడా సరిగా ఖర్చు చేయడం లేదు. పార్లమెంట్ సమావేశాలకు ముందు వారిలో సఖ్యత తీసుకొచ్చేందుకే ఆయన ముందుకు వచ్చినట్లు సమాచారం. మూడు రోజుల పాటు ఎంపీలతో సమీక్ష సమావేశాలు నిర్వహించి పార్టీని గాడిన పెట్టాలని భావిస్తున్నారు. జగన్ సుదీర్ఘ కాలం తరువాత ఎంపీలతో సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.