
‘‘వచ్చే జూన్ కల్లా.. మాకు శాసనమండలిలో పూర్తి స్థాయి మెజార్టీ వస్తుంది. అయినప్పటికీ రద్దు చేయడానికి సిద్ధమవుతున్నాం. శాసనమండలి వల్ల ఉపయోగం లేదు’’ అని వ్యాఖ్యానించారు ఏపీ సీఎం జగన్. మాటలే కాదు.. అది చేతల్లోనూ చూపించారు. నిబంధనల ప్రకారం అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానం చేసి కేంద్రానికి పంపారు కూడా. అయితే.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ నిర్ణయంపై వెనక్కు వస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: వార్తల్లో ఏపీ మంత్రులు.. టార్గెట్ అయ్యారా?!
ప్రస్తుతం శాసనమండలిలో సీట్లు ఖాళీలు అవుతుంటే.. వాటిని వెంటనే భర్తీ చేస్తున్నారు జగన్. అసలు మండలి వద్దంటూ రద్దు తీర్మానం కూడా చేసిన ముఖ్యమంత్రి.. మళ్లీ ఖాళీలను ఎందుకు భర్తీచేస్తున్నారు? అని ప్రశ్నిస్తున్నారు చాలా మంది. రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్రం పార్లమెంట్ లో బిల్లుగా చేసి ఆమోదించాల్సి ఉంది. ఆ తర్వాత రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇస్తే మండలి రద్దు అయిపోతుంది. అయితే.. అటు కేంద్రం కూడా ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు.
Also Read: అడకత్తెరలో పోకచెక్కలా ఏపీ బీజేపీ..!
కరోనా కారణంగా పార్లమెంట్ సమావేశాలు సరిగా నడవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మండలి రద్దు వంటి విషయాలు అంతగా ప్రాధాన్యం లేనివి. అందుకే కేంద్రం తాత్కాలికంగా పక్కన పెట్టిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాబోయే రోజుల్లో ఏపీ మండలి రద్దు బిల్లు పార్లమెంటు వద్దకు రావొచ్చు. అయితే.. రాష్ట్రంలో మండలిలో ఖాళీ అవుతున్న స్థానాలను భర్తీ చేస్తుండడంపై చాలా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. మండలిలో తమ పార్టీ వాళ్లే మెజారిటీ సభ్యులుగా ఉంటున్నారు కాబట్టి.. రద్దు తీర్మానాన్ని జగన్ వెనక్కి తీసుకుంటారా..? అన్న చర్చ నడుస్తోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
ఈ ఊహాగానాలు రావడానికి కారణం ఉంది ఇటీవల పలుమార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం జగన్.. ఒక్క సారి కూడా శాసనమండలి రద్దు గురించి కేంద్రంతో మాట్లాడలేదు. తమ తీర్మానాన్ని ఆమోదించాలని కోరలేదు. దీంతో.. నిర్ణయం వెనక్కు తీసుకునే ఆలోచన ఉందా? అనే చర్చ మొదలైంది. ఒకవేళ రద్దు చేస్తే.. అసంతృప్తుల సంఖ్య పెరుగుతుందని, రద్దు చేయకపోతే జగన్ మడమ తిప్పారని విమర్శలు వస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా.. ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నచందంగా ఉన్న ఈ పరిస్థితిని జగన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.