కరోనా తొలి దశలో జనంతోపాటు ప్రభుత్వాలు కూడా భయపడ్డాయి. ఏం జరుగుతుందోనని నిత్యం అప్రమత్తంగా వ్యవహరించాయి. కానీ.. తర్వాత నెమ్మదించడం.. లాక్ డౌన్ కూడా ఎత్తేయడం.. వ్యాక్సిన్ కూడా వచ్చేయడంతో ఇక పట్టపగ్గాల్లేకుండా తయారయ్యారు. ఇటు జనం అలాగే తయారయ్యారు. అటు ప్రభుత్వాలు రెండాకులు ఎక్కువే చదివాయి.
సీన్ కట్ చేస్తే.. మార్చి నుంచే సెకండ్ వేవ్ సూచనలు మొదలైనప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం గానీ.. రాష్ట్రాలు గానీ పట్టించుకున్న దాఖలాల్లేవు. చివరకు కరోనా మహోగ్రరూపమై విజృంభిస్తున్న సమయంలోనూ బెంగాల్ ఎన్నికలపై కేంద్రం దృష్టి పెట్టింది తప్ప, కరోనా గురించి పట్టించుకోలేదనే అపప్రద మూటగట్టుకుంది. ఇటు రాష్ట్రాలు కూడా అదేవిధంగా తయారయ్యాయనే విమర్శలు ఎదుర్కొంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది.
మొదటి దశలో అంతో ఇంతో స్పందించిన ప్రభుత్వం.. ఇప్పుడు జనాన్ని గాలికి వదిలేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికి కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సమీక్షలు కొరవడ్డాయని అంటున్నారు. ఇటు అధికారులకు కూడా తగిన సూచనలు లేక.. ఎవరికి తోచింది వారు చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో.. నిత్యం పదివేల కేసుల వరకూ నమోదవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ లెక్క మరింతగా పెరుగుతుందని అంటున్నారు.
ఇక, ఆసుపత్రులపై పర్యవేక్షణ లేకపోవడంతో.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. కొవిడ్ పేరు చెప్పి కోట్లాది రూపాయలు దండుకుంటున్నా పట్టించుకునే వారే కరువయ్యారని రోగులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు ఆసుపత్రులు నిండిపోవడంతో.. కొత్తగా వచ్చే రోగులకు బెడ్లు దొరకట్లేదు. ఇలాంటి సమయంలో ప్రత్యేక కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సింది. వాటి గురించి కనీసంగా కూడా సీఎం జగన్ పట్టించుకోవట్లేదని అంటున్నారు.
కేవలం తన రాజకీయాలు మాత్రమే ముఖ్యమంత్రి చూసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే నిరక్ష్యం కొనసాగితే.. రాబోయే రోజుల్లో రాష్ట్రం వల్లకాడు అవుతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు జనం. ఇకనైనా స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మరి, సీఎం జగన్ ఏం చేస్తారో చూడాల్సి ఉంది.