
ముఖ్యమంత్రి జగన్ కు సలహాదారులు చిక్కు తెచ్చిపెడుతున్నారా? వారి వ్యవహార శైలి జగన్ కు తలనొప్పిగా మారుతోందా? అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బడి ముబ్బడిగా సలహాదారుల పదువులు కేటాయించిన సంగతి తెలిసిందే. ఎన్నికల వేళ తనకు వెన్నుదన్నుగా ఉన్నవారిని గుర్తుపెట్టుకొని.. వారికి ఏదో విధంగా న్యాయం చేసేందుకు సలహాదారులుగా పదవులు ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమైంది.
అయితే.. వీరిలో ఒక ఇద్దరు మాత్రం సలహదారు పదవి వదిలేసి.. రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న ఒక సలహాదారు ఎమ్మెల్యే మాదిరిగా.. ఢిల్లీలో ఉన్న మరో సీనియర్ పాత్రిక సలహాదారు ఎంపీగా బిహేవ్ చేస్తున్నారని అంటున్నారు. దేశరాజధానిలో ఉన్న ఆ సలహాదారు.. వైసీపీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారనే చర్చ సాగుతోంది. సీఎం జగన్ ఢిల్లీ టూర్ కు వెళ్తే.. మొత్తం ఆయనే దగ్గరుండి నడిపిస్తున్నారని చెబుతున్నారు.
ఇక, రాష్ట్రంలో ఉన్న మరో కీలక సలహాదారు కూడా సలహాలు మానేసి.. రాజకీయాలు మాట్లాడుతూ నిత్యం మీడియాలోనే కనిపిస్తున్నారు. దీంతో.. వీరి వ్యవహారశైలి విమర్శలకు తావిస్తోంది. ఇదే సమయంలో.. సలహాదారుల నియామకం, వారికి చెల్లిస్తున్న జీతాల విషయమై హైకోర్టు ఆరాతీయడం గమనార్హం. త్వరలో ఈ అంశంపై సమీక్ష చేయనుంది.
అంతేకాదు.. సలహాదారులు ప్రభుత్వానికి అడ్వైస్ చేయడం మానేసి.. పొలిటికల్ గా హైలైట్ అవుతుండడంపైనా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది.సలహదారుల లెక్క కూడా తేలుస్తామని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో జగన్ దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారనే ప్రచారం సాగుతోంది. వీళ్లిద్దరినీ వదులుకోవడానికి సిద్ధంగా లేని జగన్.. మరో విధంగా వారిని అట్టిపెట్టుకునే చర్యలు చేపడుతున్నారట. ముందుగా రాష్ట్రంలో ఉన్న సలహాదారును ఎమ్మెల్సీ చేస్తారని తెలుస్తోంది. ఢిల్లీలో ఉన్న అడ్వైజర్ కు సైతం ఏదోవిధంగా సెట్ చేస్తారని అంటున్నారు. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.