Telangana Election Results 2023: తెలంగాణలో అధికారానికి రావాల్సిన అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ కన్నా ఐదు స్థానాలు ఎక్కువే గెలిచింది. అధికారిక ప్రకటనే మిగిలి ఉంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమైంది. దీంతో సీఎం పదవి కోసం ముందు నుంచి టీపీసీసీ చీఫ్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి తానేనని ప్రచార సమయంలో అభ్యర్థులతో పలికించారు. అనుకూల మీడియాలో రాయించుకున్నారు. దీంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డే సీఎం అవుతారనే ప్రచారం ఊపందుకుంది.
రంగంలోకి భట్టి..
ఇదిలా ఉంటే.. ఐదేళ్లు సీఎల్పీ నేతగా ఉన్న భట్టి విక్రమార్క కూడా రంగంలోకి దిగారు. ఆయనకు అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయి. ఇప్పటికే దళిత సీఎం అనే ఇండికేషన్ క్యాడర్‌లోకి పంపించింది. దీంతో ఎమ్మెల్యేగా, సీఎల్పీ నేతగా పనిచేసిన అనుభవం కూడా భట్టికి కలిసి వచ్చే అశం కావడంతో ఆయన కూడా తన వంతుగా సీఎం పీఠం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇక టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సీఎం రేసులో ఉన్నట్లు సంకేతాలిస్తున్నారు.
అధిష్టానానిదే నిర్ణయం..
ఇక టీపీసీసీ చీఫ్ నుంచి సీనియర్ల వరకు అందరికీ సీఎం కావాలన్న ఆకాంక్ష లోపల ఉన్నా.. అందరూ అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అంటున్నారు. మరోవైపు తమస్థాయిలో ఢిల్లీలో ఉన్న పలుకుబడిని ఉపయోగించి సీఎం పీటం కోసం పావులు కదుపుతున్నారు. అధిస్టానంపై ఎత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సీనియారిటీ, దళిత కార్డును భట్టి విక్రమార్క ఉపయోగిస్తున్నారు. సీఎంగా తన పేరు తీసుకురావడానికి మీడియా ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. మీడియా ద్వారా సీఎం రేసులో ఉన్నారా అన్న ప్రశ్న అడిగించుకుని.. తప‍్పకుండా ఉన్నానని, పదవి ఇస్తే బాధ్యతగా భావిస్తానని ప్రకటించారు.
తాజ్ కృష్ణలో కీలక భేటీ..
మరోవైపు తెలంగాణలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌కు రావాలని కాంగ్రెస్ నుంచి పిలుపు వచి‍్చంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ తాజ్‌కృష్ణలో ఈ రాత్రి కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇందులో సీఎం అంశంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డీకే ద్వారా సీఎం అభ్యర్థికి మార‍్గం సుగమం చేస్తారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. ఎమ్మెల్యేలకు కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు జారిపోకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
రేపే ప్రమాణ స్వీకారమా..
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం కొలువుదీరుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఈమేరకు గాంధీ భవన్ నుంచి లీకులు వస్తున్నాయి. అయితే అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన లేదు.