Congress: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటి నుంచే ఆయా పార్టీలు సరికొత్త సంకేతాలు ఇస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో సైతం వైసిపి, టిడిపిలు కాంగ్రెస్కు స్నేహ హస్తం అందిస్తూ సంకేతాలు పంపాయని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి తప్పుకోవడానికి అదే కారణమన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు షర్మిలను కాంగ్రెస్ పట్టించుకోకున్నా.. ఆమె భేషరతు మద్దతు వెనుక ఏపీ సీఎం జగన్ ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో వస్తే స్నేహ హస్తం అందుకోవాలన్నదే టిడిపి, వైసిపి ప్లాన్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీపై ఫోకస్ పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజనతో ఏపీ ప్రజల పాలిట కాంగ్రెస్ విలన్ గా మారింది. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకుంటామని రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రకటించారు. ఎంత ఖర్చయినా పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం తరఫున నిర్మిస్తామని సైతం హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించి ప్రభుత్వ రంగంలోనే బలోపేతం చేస్తామని చెప్పుకొచ్చారు. దాదాపు విభజన హామీలన్నీ అమలు చేసి.. రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామని రాహుల్ గాంధీ విస్పష్ట ప్రకటన చేశారు. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందితే.. ఏపీ విషయంలో ఇదే హామీలు ఇచ్చి ముందుకెళ్లాలన్నది కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ప్లాన్.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందితే.. ఏపీలో శరవేగంగా పార్టీ విస్తరణకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యం.. కాంగ్రెస్ పార్టీకి ఎంతగానో సహకరిస్తుంది. అవినీతి కేసుల్లో చంద్రబాబును జగన్ ప్రభుత్వం అరెస్టు చేయించింది. దీని వెనుక బిజెపి ఉందన్న ప్రచారం ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు బిజెపిని విలన్ గా చూస్తున్నారు. జగన్ సన్నిహితుడుగా కెసిఆర్ ఉన్నారు. దీంతో తెలంగాణ ఎన్నికల్లో బిఆర్ఎస్, బిజెపిలను టిడిపి క్యాడర్ తో పాటు సెటిలర్స్, కమ్మ సామాజిక వర్గం ప్రత్యర్థులుగా చూస్తోంది. ఆ రెండు పార్టీలకు ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ ఆశాకిరణంగా కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల నుంచి టిడిపి తప్పుకోవడంతో లైన్ క్లియర్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా గెలిస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ అడ్వాంటేజ్ గా తీసుకునే అవకాశం ఉంది. బహుశా దీనినే గమనించి జగన్ సోదరి షర్మిలను కాంగ్రెస్ గూటికి పంపించారన్న టాక్ సైతం ఉంది. అటు రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ సపోర్ట్ వెనుక జగన్ ఉన్నారన్న అనుమానం సైతం ఉంది. ఇదంతా ముందస్తు చర్యల్లో భాగంగా చేస్తున్నదేనన్న ప్రచారం ఉంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందితే మాత్రం ఇండియా కూటమి బలోపేతమయ్యే స్పష్టమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు సెమీఫైనల్ గా నిలవనున్నాయి. కాంగ్రెస్ విజయం సాధిస్తే దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ.. హస్తం నీడలోకి చేరనున్నాయి. ఇప్పటివరకు బిజెపి బాధిత ప్రాంతీయ పార్టీలు కొన్ని స్తబ్దుగా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు ధైర్యం పోగుచేసుకుని కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీకి సంబంధించి ఇప్పుడున్న పరిస్థితుల్లో… ఏ ప్రభుత్వం అధికారికంలోకి వచ్చినా కేంద్రం మద్దతు అవసరం. అందుకే ఇప్పుడు వైసీపీ, టిడిపిలు జాతీయ పార్టీలతో స్నేహానికి ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్కు అవకాశాలు కనిపిస్తుండడంతో.. తాము ఎంతో దూరంలో లేమని సంకేతాలు పంపుతున్నాయి.