History Of Nizam: తెలంగాణాలో ఎన్నికల హీట్ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడింది. 2023 సమ్మర్ లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో రెండోసారి అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రతిపక్షం లేకుండా చేసింది. కాంగ్రెస్ ముఖ్యనేతలను పార్టీలో చేర్చుకుంది. గెలిచిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లోకి లాక్కుంది. కాంగ్రెస్ బలహీనపడిన నేపథ్యంలో అక్కడ ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అధికార టీఆర్ఎస్ కి చుక్కలు చూపిస్తుంది. ఎన్నడూ లేని విధంగా గణనీయంగా బీజేపీ ఓట్ల శాతం పెరిగింది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పని చేస్తుంది. మెజారిటీ సీట్లు గెలవకున్నా చెప్పుకోదగ్గ సీట్స్ గెలిచి నిర్ణయాత్మక స్థితికి చేరాలనుకుంటున్నారు. దీనికి సినిమాల రూపంలో ప్రణాళికలు వేస్తున్నారట. ఈ ప్లాన్ లో భాగంగా నైజాం చరిత్ర వివరిస్తూ మూడు ప్రాజెక్ట్స్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కాశ్మీర్ ఫైల్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఒక చిత్రం నిర్మించనుండగా, బీజేపీ లీడర్ మరో మూవీకి శ్రీకారం చుట్టారు. అలాగే స్టార్ రైటర్ రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ ఇదే సబ్జెక్టు పై స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట.
హైదరాబాద్ నిజాం పాలన, రజాకార్ల అరాచకాలు, రైతు ఉద్యమాలు హైలెట్ చేస్తూ ఆ నాటి సామాజిక, రాజకీయ పరిస్థితులు వాస్తవాలకు దగ్గరగా తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిర్మాత అభిషేక్ అగర్వాల్ దీనిపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ… ”రెండు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ పై పని చేస్తున్నాము. 11 మంది సభ్యులు రీసెర్చ్ చేస్తున్నారు. వాళ్ళ స్క్రిప్ట్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఎలాంటి పక్షపాతం లేకుండా నైజాం కాలం నాటి పరిస్థితులు వాస్తవికంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాము” అన్నారు.

నిర్మాత అభిషేక్ అగర్వాల్ కి యూనియన్ టూరిస్ట్ మినిస్టర్ కిషన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలున్నాయి. స్టేట్ బీజేపీ లీడర్స్ కూడా ఆయనకు చాలా క్లోజ్. కాగా మా చిత్రం ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించినది కాదన్నా అభిషేక్ ఇది రాజకీయ ఎజెండాలో భాగంగా తెరకెక్కుతున్న చిత్రం కాదని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఓ బీజేపీ లీడర్ ఇటీవల ఓ మూవీని ఇదే సబ్జెక్టుతో ప్రారంభించారు. ఆగస్టు 29న అధికారికంగా పూజా కార్యక్రమాలతో మూవీ ప్రారంభమైంది.అలాగే విజయేంద్ర ప్రసాద్ డెవలప్ చేస్తున్న స్క్రిప్ట్ తో మరో మూవీ తెరకెక్కనుంది.
నైజాం చరిత్రపై మొత్తంగా మూడు సినిమాలు విడుదల కానున్నాయి. ఈ చిత్రాలన్నీ బీజేపీ పొలిటికల్ ఎజెండాలో భాగమేనని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల సమయాత్తంలో భాగంగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ సినిమాలు అంటున్నారు. ప్రభాస్ భారీ పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్ వెనుక బీజేపీ ఉన్నట్లు ఇప్పటికే కేటీఆర్ విమర్శించిన విషయం తెలిసిందే. హిందుత్వం పేరుతో ప్రజల ఓట్లు కొల్లగొట్టడానికి ఆదిపురుష్ మూవీ చేస్తున్నారని ఆరోపించారు. నైజాం చరిత్రపై తెరకెక్కుతున్న ఈ మూడు చిత్రాలు 2023 ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రగా కొందరు అభిప్రాయపడుతున్నారు.