Chandrababu And Pawan Kalyan: టిడిపి అధినేత చంద్రబాబును పవన్ కలుసుకున్నారు. ఇద్దరు నేతలు కీలక చర్చలు జరిపారు. ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు సీట్ల సర్దుబాటు, ఎవరు ఎన్ని స్థానాల్లో.. ఎక్కడెక్కడ నుంచి పోటీ చేయాలి అనే అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు పవన్ నేరుగా వచ్చి చంద్రబాబుతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే పవన్ బలమైన స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పుకొచ్చారు. పట్టుదలకు పోకూడదని.. వైసీపీకి ఛాన్స్ ఇచ్చే ఏ అవకాశాన్ని వదులుకోకూడదని ఇద్దరు నేతలు భావిస్తున్నట్లు సమాచారం.
జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాలపై పవన్ ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో సమీక్షలు జరిపి పార్టీ శ్రేణుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించారు. వాటిపై ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీతో చర్చించినట్లు సమాచారం. అందుకే వాటిపై సమగ్రంగా చర్చించేందుకు చంద్రబాబును పవన్ కలిసినట్లు తెలుస్తోంది. అటు పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై చంద్రబాబుతో చర్చించారని తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గం విషయంలో స్పష్టత రానున్నట్లు సమాచారం.
సంక్రాంతికి తొలి జాబితాను ప్రకటించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఎలాంటి వివాదాలు లేని పాతిక సీట్లను చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది. అదే సమయంలో జనసేనకు కేటాయిస్తారని భావిస్తున్న నియోజకవర్గాల్లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ తమ పార్టీ అభ్యర్థుల కసరత్తును కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల జనసేనలో చేరికల సంఖ్య పెరిగింది. టికెట్ కేటాయిస్తామంటే పార్టీలో చేరేందుకు చాలా మంది వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారు. కానీ పక్క పార్టీల నుంచి చేరిన వారి విషయంలో పవన్ ఆచీతూచీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే వైసిపి నుంచి చేరికలకు ప్రోత్సహించడం లేదు.
రాష్ట్రవ్యాప్తంగా భోగి వేడుకల్లో టిడిపి, జనసేన శ్రేణులు కలిసి పాల్గొనాలని చంద్రబాబుతో పాటు పవన్ నిర్ణయించుకున్నారు. పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇరువురు నేతలు మందడంలోని గోల్డెన్ రూల్ స్కూల్లో భోగి వేడుకలు జరుపుకోవాలని డిసైడ్ అయ్యారు. ఏపీలో వైసీపీ సర్కార్ తెచ్చిన ప్రజా వ్యతిరేక జీవోలను భోగి మంటల్లో వేసి నిరసన తెలుపనున్నారు.