Cinematograph Bill 2023: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి సినిమా కార్మికులపై సడెన్‌గా ప్రేమ పుట్టుకొచ్చింది. సినిమా పరిశ్రమను ఆంధ్రాకు తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకోని జగన్ సర్కార్.. సడెన్‌గా కార్మికుల సంక్షేమం, కష్టం, వేతనం గురించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో మాట్లాడడం అందరనీ ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమాటోగ్రాఫీ చట్టాన్ని సవరించేందుకు ప్రవేశపెట్టిన బిల్లుపై జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇటు సినిమా ఇండస్ట్రీలో, అటు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.
ఏం మాట్లాడారంటే..
చలన చిత్ర రంగంలో హీరోలకు చెల్లించే పారితోషకాలు కోట్లలో ఉంటే చిత్ర నిర్మాణం కోసం వివిధ విభాగాల్లో పనిచేసే కార్మికుల వేతనాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి అని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. భారతీయ చలన చిత్ర రంగంలో వివిధ విభాగాల్లో రెండు లక్షల మందికిపైగా కార్మికులు పని చేస్తున్నారు. కాని చిత్ర నిర్మాణం వ్యయంలో మూడోవంతు బడ్జెట్ హీరోలు ఇతర అగ్ర నటుల పారితోషకాలకే సరిపోతున్నాయి అని చెప్పుకొచ్చారు. ఉదాహరణకు టాప్ హీరో సల్మాన్‌ఖాన్‌తో రూ.400 కోట్ల వ్యయంతో నిర్మించే బాలీవుడ్ చిత్రంలో ఆయన పారితోషకమే రూ.250 కోట్లని తెలుస్తోంది. అదిపోగా మిగిలిన బడ్జెట్‌తోనే చిత్ర నిర్మాణం పూర్తి చేయాలి. చిత్ర నిర్మాణంలో రేయింబవళ్లు కష్టపడే కార్మికులకు వారి శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కడం లేదు అని చెప్పుకొచ్చారు. నిర్మాణ వ్యయంలో సింహభాగం పారితోషకం తీసుకుంటున్న హీరోలే నిజమైన లబ్ధిదారులవుతున్నారు అని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సినిమాటోగ్రఫి మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు సూచించారు.
ఇండస్ట్రీపై ఎప్పుడు చిన్నచూపే..
ఇదిలా ఉంటే.. ఏపీ ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీపై మొదటి నుంచి చిన్నచూపే ఉంది. పొరుగున్న ఉన్న తెలంగాణ సర్కార్ సినీ కార్మికుల సంక్షేమంతోపాటు, నిర్మాతల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. భారీ బడ్జెట్ సినిమాలు రిజీల్ అయినప్పుడు టికెట్ చార్జీలు పెంచుకునే వెసులుబాటు కూడా కల్పిస్తోంది. ఏపీ సర్కార్ మాత్రం టికెట్ చార్జీలు ఆన్‌లైన్‌లో విక్రయిస్తోంది. చార్జీల పెంపు ఊసేలేదు. ఇలాంటి ప్రభుత్వం సినిమా కార్మికుల వేతనాలు పెంచాలని కోరడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఓట్ల కోసమేనా…
సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లుకు వైసీపీ మద్దతు ఇచ్చింది. బీజేపీకి, కాంగ్రెస్‌కు దూరమని ప్రకటించే సీఎం.. ఎన్డీఏ సర్కార్ బిల్లులకు మాత్రం పార్లమెంట్‌లో మద్దతు ఇస్తున్నారు. దీని వెనుక స్వప్రయోజనాలు ఉన్నాయనడం ఎవరూ కాదనలేని వాస్తవం. ఇక తాజాగా సినిమా కార్మికులపై ప్రేమ ఒలకబోయడం వెనుక ఓట్ల వ్యూహం ఎదైనా ఉందా అన్న చర్చ ఏపీ పాలిటిక్స్‌లో జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సినిమా రంగానికి చెందిన వారి ఓట్లు కూడా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ పార్లమెంటరీ పార్టీనేత రాజ్యసభలో కార్మికుల పక్షాన మాట్లాడి ఉంటారని భావిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు, స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులను మచ్చిక చేసుకునే ఎత్తుగడలో ఇది ఒక భాగమని అటు ఇండస్ట్రీ వర్గాలు.. ఇటు ఏపీ రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు.