Chandrababu: బాబు టీం కి సిఐడి నోటీసులు

తాజాగా వెలుగులోకి వచ్చిన ఐటీ స్కాం తో పాటు గతంలో సంచలనంగా మారిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో సైతం పాత్రధారులు ఒక్కరే అన్న విషయం వెలుగులోకి వచ్చింది.

Written By: Dharma, Updated On : September 6, 2023 6:26 pm

Chandrababu

Follow us on

Chandrababu: చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే ఐటి అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. మరింత హాట్ టాపిక్ గా మారుతోంది. ఐటీ స్కాం తో పాటు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ సైతం మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండింటి మూలాలు ఒకేచోట ఉన్నాయని ఏపీ సర్కార్ భావిస్తోంది. సిఐడి విచారణకు సిద్ధమవుతోంది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఐటీ స్కాం తో పాటు గతంలో సంచలనంగా మారిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో సైతం పాత్రధారులు ఒక్కరే అన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సిఐడి రంగంలోకి దిగింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో నిందితుడు యోగేష్ గుప్తాకు, తాజా ఐటీ స్కామ్ లో కీలక వ్యక్తిగా పేర్కొన్న మనోజ్ వాసుదేవ్ పార్థసానికి సిఐడి నోటీసులు జారీ చేసింది.

అమరావతి నిర్మాణంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థల నుంచి ముడుపులు తీసుకున్నారన్నది ప్రధాన అభియోగం. అదే సమయంలో స్కిల్ డెవలప్మెంట్ పథకంలోనూ భారీగా అవినీతికి పాల్పడ్డారు అంటూ ఆరోపణలు ఉన్నాయి. ఈ రెండింటిలోనూ చంద్రబాబు పిఎ శ్రీనివాస్ పై కీలక అభియోగాలు మోప బడ్డాయి. ఈ రెండు స్కాములలోనూ డబ్బు చేరింది ఒక్కరికే అని దర్యాప్తు సంస్థలు వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సిఐడి రంగంలోకి దిగడం కీలకంగా మారింది. అటు దుబాయిలోనూ చంద్రబాబు డబ్బు అందుకున్నట్లు అభియోగాలు ఉన్నాయి. వీటన్నింటిపై ఏపీ సీఐడీ దర్యాప్తునకు దిగనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఎన్నికల ముంగిట చంద్రబాబుకు జలక్ తగిలినట్లే.