
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నిబంధనల ఉల్లంఘన జరిగిన్నట్లు, తనకు ప్రాణ హాని ఉన్నట్లు మాజీ ఎన్నికల కమీషనర్ ఎన్ రమేష్ కుమార్ కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు వ్రాసిన లేఖను ఆయన గాని, ఆయన కార్యాలయంలో గాని ఎవ్వరు వ్రాయలేదని, ఆ లేఖను బైటివారే వ్రాసి ఆయనకు పంపారని ఈ లేఖ విషయమై దర్యాప్తు జరుపుతున్న ఏపీ సిఐడి నిర్ధారణకు వచ్చిన్నట్లు తెలుస్తున్నది.
రమేష్ కుమార్ రాసిన లేఖను బయట టైప్ చేయించి పెన్ డ్రైవ్ నుంచి ల్యాప్‌టాప్‌లో వేసినట్లు దర్యాప్తుల్లో వెల్లడైంది. ఆ లేఖను మొబైల్ ద్వారా కేంద్రానికి పంపారని సీఐడీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు లెటర్‌ను ల్యాప్‌టాప్‌లో డిలీట్ చేయడంతో పాటు పెన్‌డ్రైవ్‌ను ధ్వంసం చేశారని రమేష్ కుమార్ కర్యాలయ సిబ్బంది సీఐడీకి చెప్పినట్లు తెలుస్తోంది.
అనంతరం డెస్క్ టాప్ కూడా ఫార్మాట్ చేశారని చెప్పారు. దీంతో సాక్ష్యాలు ధ్వంసం చేయడంపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఆధారాలు ట్యాంపర్ చేసిన అంశంపై కేసు నమోదు చేశామని సీఐడీ డీజీ సునీల్ కుమార్ తెలిపారు.
లేఖ నంబర్‌పైన కూడా కొన్ని ఆధారాలు సేకరించామని చెప్పారు. కేంద్రంకు రాసిన లేఖ 221 నంబర్‌తోనే, అశోక్‌బాబు రాసిన రెఫ్రెన్స్ లెటర్‌కు కూడా ఉందని పేర్కొన్నారు.
కాగా, ఈ లేఖను తానే రాశానని ఎన్నికల సంఘం రమేష్ కుమార్ ఇప్పటికే ప్రకటించారు. ఇదే విషయాన్ని హైకోర్టులో వేసిన అఫిడవిట్‌లోనూ పేర్కొన్నారు.
టీడీపీ కార్యాలయంలో తయారు చేసిన ఆ లేఖను రమేష్ కుమార్ కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖకు పంపారని వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. కేంద్రానికి రమేష్ కుమార్ రాసిన లేఖపై దర్యాప్తు జరపాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు డీజీపీ సిఐడి చేత విచారణకు ఆదేశించారు.