కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని క్రైస్తవులు ఏప్రిల్ 14వ తేదీ వరకు తమ ఇళ్ళలోనే ప్రార్థనలు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రైస్తవ మైనారిటీ ఆర్థిక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. ఏసురత్నం విజ్ఞప్తి చేశారు. మన దేశంలోను, రాష్ట్రంలోను కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తున్నందున ఏప్రిల్ 14 వరకు వచ్చే ఆదివారాలు, మట్ల ఆదివారం, గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ రోజులలో రాష్ట్రంలోని క్రైస్తవులందరూ వారి వారి గృహాలలోనే ప్రార్థనలు చేసుకోవాలని యేసురత్నం కోరారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా అంటువ్యాధి నివారణకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్ ను ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అధిక సంఖ్యలో క్రైస్తవులు చర్చిలకు వెళ్లడంతో వైరస్ వ్యాప్తికి అవకాశాలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.