సినీ ఇండస్ర్టీలో మెగాస్టార్ స్థాయికి ఎదిగి సక్సెస్ అయిన చిరంజీవి.. రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి దానిని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆ తర్వాత కేంద్రంలో మంత్రి పదవిని అనుభవించారు. నిన్నామొన్నటి వరకు రాజ్యసభ సభ్యత్వంలో కొనసాగారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ మధ్య మెగాస్టార్ మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు. దీంతో రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పుడు ఆయన ఏ పార్టీకి మద్దతుగా ఉన్నారు..? అంటే ప్రత్యక్షంగా ఏ పార్టీకీ మద్దతు అయితే తెలపడం లేదు. తన సోదరుడు పవన్‌కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో మరో సోదరుడు నాగబాబు నేతగా ఉన్నా.. చిరంజీవి మాత్రం ఎలాంటి పదవులు తీసుకోలేదు. 2019 ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపని జనసేన పార్టీ.. ఇప్పుడు బీజేపీతో జట్టు కట్టింది. ఒక విధంగా బీజేపీకి మిత్రపక్షమైంది. ప్రభుత్వంపై సమరానికి ఇరు పార్టీలు కలిసే సమరం సాగించాలని డిసైడ్ కూడా అయ్యాయి. అయితే.. ఈ క్రమంలో చిరును కూడా బీజేపీ వైపు నడిపించే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల పవన్ కల్యాణ్ బర్త్‌డే సందర్భంగా బ్యానర్ కడుతూ చిత్తూరులో ముగ్గురు యువకులు కరెంట్ షాక్‌తో చనిపోయారు. వీరి విషయంలో రామ్‌చరణ్ స్పందించాడు. అటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సైతం స్పందించి తన వంతుగా ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షలు ఇచ్చారు. నిజానికి ఈ పరిణామం వెనుక.. పవన్ పార్టీ విషయంలో ఇప్పటివరకు మౌనంగా ఉన్న చిరంజీవిని కదిలించేందుకు, అదే సమయంలో బీజేపీతోనూ జట్టు కట్టేలా ప్రోత్సహించడమనే వ్యూహం ఉందని అంటున్నారు పరిశీలకులు.
మొన్నటి వరకు వేర్వేరుగా ఉన్న మెగా ఫ్యామిలీ ఇప్పుడంతా ఒక్క తాటి మీదకు వచ్చినట్లు అర్థమవుతోంది. అందరూ కలిసి చిరంజీవిని బీజేపీకి చేరువ చేయించాలని చూస్తున్నారు. రాబోవు రోజుల్లో చిరుకు రాజ్యసభ సభ్యత్వం లేదా.. కేంద్రంలో ఏదైనా పదవి దక్కాలనే ఆలోచనలో ఉన్నారట. మొత్తానికి చిరు కుటుంబంలో కమలం వికసిస్తుందో లేదో తెలియాలంటే ఎదురుచూడాల్సిందే.