
అమెరికా-ఇరాన్-చైనాల మధ్య శత్రువుకి శత్రువు మిత్రుడు అనే నానుడి నడుస్తుంది.ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులకు మద్దతిస్తోందని, అణుకార్యకలాపాలు చేపడుతోందని ఇరాన్ పై అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో ఇరాన్ ఆర్థికంగా ఇక్కట్లను ఎదుర్కొంటోంది. ఏ దేశం కూడా అమెరికా భయానికి సాయం చేయటానికి ముందుకు రావటం లేదు. ఈ పరిస్థితుల్లో ఇరాన్ ముందున్న ఏకైక మార్గం చైనానే. అందుకే చైనాతో ఒప్పందానికి సై అంటోంది.
అటు చైనా కూడా అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఇరాన్ కు సాయం చేయటానికి ముందుకొస్తోంది. దీంతో తన చమురు అవసరాలు(చైనా తాను వాడే చమురులో 75శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది) తీరటంతో పాటు… అంతర్జాతీయ రాజకీయాల్లో కీలకమైన మధ్యప్రాచ్యంలోనూ పాగా వేసేందుకు చైనాకు సందు దొరుకుతోంది. తన బెల్ట్ రోడ్డు ద్వారా యూరప్‌పై పట్టుకు ప్రయత్నిస్తున్న చైనాకు ఇది సానుకూలాంశంగా చెబుతున్నారు. చైనా తన మిలటరీ కేంద్రాలను విస్తరించటానికి కూడా దోహదపడుతుంది. పెర్షియన్ గల్ఫ్ ముఖద్వారంగా చెప్పుకునే జాస్క్ వద్ద చైనా పలు నౌకాశ్రయాల నిర్మాణానికి ప్రతిపాదిస్తోంది. మధ్య ఆసియాలోనే కాకుండా… ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాలో ఈ ప్రాంతం, ఈ పోర్టు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైంది. ఇప్పటిదాకా దీనిపై అమెరికా పట్టుంది. ఇప్పుడు చైనా కూడా ఇరాన్ తో ఒప్పందం రూపంలో రంగంలోకి దిగుతోంది.
ఒప్పందం ప్రకారం వివిధ రంగాల్లో సుమారు 400 బిలియన్ డాలర్ల మేర ఇరాన్ లో చైనా పెట్టుబడులు పెడుతుంది. రక్షణ, బ్యాంకింగ్, టెలికాం, పోర్టులు, రైల్వేలు, ఫ్రీ ట్రేడ్ జోన్స్ నిర్మాణం తదితర రంగాల్లో చైనా సాయం చేస్తుంది. అంతేగాకుండా కీలకమైన మిలటరీ, భద్రత అంశాల్లో పరస్పర సహకారం ఉంటుంది. బదులుగా సుమారు 25 సంవత్సరాల పాటు చైనాకు ఇరాన్ తక్కువ ధరలకు చమురును సరఫరా చేస్తుంది.
అయితే ఇరాన్ లో మాత్రం ఈ ఒప్పందంపై పూర్తి మద్దతు కన్పించటం లేదు. చైనాకు – దేశాన్ని తాకట్టు పెట్టడమే అంటూ చాలామందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆసియా, ఆఫ్రికాలోని కొన్ని దేశాలతో చైనా ఇలాంటి ఒప్పందాలు చేసుకొని వారిని లొంగదీసుకుంటున్న వైనం చూసి ఇరానియన్లలో ఈ భయం నెలకొంది. కానీ… అమెరికా ఆంక్షలతో ఆర్థికంగా దిగజారుతున్న నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వానికి చైనానే కల్పతరువులా కనిపిస్తోంది.