ప్రపంచ పెద్దన్న అనే పాత్రలో ఇన్నాళ్లూ అమెరికా ఎదురు లేకుండా కొనసాగింది. తనదే ఆధిపత్యం అన్నట్టుగా వ్యవహరించింది. అయితే.. ఇప్పుడు అమెరికాకు గట్టి సవాల్ చైనా నుంచి ఎదురవుతోంది. ప్రపంచంపై ఆధిపత్యం కోసం చైనా చేస్తున్న ప్రయత్నాలు మరింత వేగవంతం అవుతున్నాయి. ఇందుకు అవసరమైన అన్ని శక్తులనూ సమకూర్చుకుంటోంది. ఇప్పటికే ప్రబల ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనా.. ఇతర దేశాలను తన దారిలోకి తెచ్చుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలనూ, అస్త్రాలను వాడేస్తోంది.
ఒకవైపు.. తన అభివృద్ధిని అప్రతిహతంగా కొనసాగిస్తోంది. ఆ దేశ జీడీపీ ఎదుగుదల చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో 18.3 శాతం వృద్ధిరేటు నమోదు చేసింది. ఇది 2.85 కోట్ల కోట్లకు సమానం. 1992 తర్వాత చైనా ఈ స్థాయిలో జడీపీ నమోదు చేయడం ఇదే మొదటి సారి. పారిశ్రామిక అభివృద్ధిలో 14.1 శాతం, రిటైల్ విక్రయాల్లో 34.3 శాతం అభివృద్ధి నమోదు కావడం గమనించాల్సిన అంశం. ఇది కూడా కరోనాతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్ప కూలిపోయిన సమయంలో నమోదు కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ విధమైన అభివృద్ధితో.. ప్రపంచంలో అమెరికా తర్వాత రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా అవతరించింది. 2010 తర్వాత జపాన్ ను వెనక్కు నెట్టిన చైనా.. శరవేగంగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, భారత్ తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. అయితే.. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో చైనా స్థాయిలో ఏ దేశం కూడా వృద్ధి రేటు నమోదు చేయలేదు. కరోనా కష్టాల్లో పడి ప్రపంచం అవస్థలు పడతుంటే.. దాన్ని పుట్టించి, ప్రపంచానికి అంటించిన చైనా మాత్రం దూసుకుపోతుండడం గమనార్హం. సాధ్యమైనంత త్వరలో అమెరికాను వెనక్కి నెట్టేసి నెంబర్ వన్ ప్లేసులోకి వెళ్లాలని ప్రయత్నిస్తోంది డ్రాగన్.
మరోవైపు.. ఇతర దేశాలను తన ఆధిపత్యంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. సామ, దాన బేద దండోపాయాలను వాడుతూ ముందుకు సాగుతోంది. గడిచిన పదేళ్లలో ప్రపంచంలోని వివిధ దేశాలకు చైనా అందించిన విరాళాలు ఏకంగా 350 శాతం పెరిగాయి. గతంలో అమెరికా ఇలాంటి పనులు చేసేది. అవసరంలో ఉన్నవారికి సహాయం, అప్పులు ఇచ్చి.. తమ దారికి తెచ్చుకునేది. ఇప్పుడు చైనా ఆ పని చేస్తోంది. ట్రంప్ హయాంలో ఇలాంటి విరాళాలు తగ్గించడంతో.. చైనా ముందుకొచ్చి విరివిగా విరాళాలు ఇచ్చేసింది.
మరోవైపు.. ‘బెల్ట్ అండ్ రోడ్’ విధానాన్ని అనుసరిస్తోంది. ఈ వ్యూహాన్ని పటిష్టంగా అమలు చేస్తోంది. ఇప్పటికే దాదాపు 60 దేశాల్లో నిర్మాణ రంగంలో పలు ప్రాజెక్టులను కొనసాగిస్తోంది. భూమి, సముద్రం మార్గాల ద్వారా మధ్య ఆసియా, ఆగ్నేయాసియా, యూరోప్, తూర్పు దేశాలు, ఆఫ్రికా.. ఇలా అన్ని ఖండాలతోనూ తనను అనుసంధానం చేసుకుంటోంది. కష్టాల్లో ఉన్న ఆయా దేశాల్లో అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకే ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ను ఏర్పాటు చేస్తున్నామని చైనా చెబుతోంది. భారత్ చుట్టూ ఉన్న పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకకు సైతం రోడ్ అండ్ బెల్ట్ ను విస్తరించింది. భారత్ మాత్రం ఇందుకు అంగీకరించలేదు.
అటు అంతర్జాతీయ సంస్థల్లోనూ తన వారిని నియమిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతిగా ఉన్న టెడ్రోస్ నియామకానికి చైనా మద్దతు తెలిపింది. ఈ కారణంగానే.. కరోనా విషయంలో డబ్ల్యూహెచ్ ఓ చైనాకు అనుకూలంగా వ్యవహరించిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అందరూ చైనానే దోషిగా చూపినా.. ఆధారాల్లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇలా.. పలు అంతర్జాతీయ సంస్థల్లోనూ తనకు అనుకూలమైన వారిని నియమించుకుంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి అన్ని వైపుల నుంచీ దూసుకొస్తున్న చైనా.. ప్రపంచ అగ్రరాజ్యం అని పిలిపించుకునేందుకు తహతహలాడుతోంది. మరి, భవిష్యత్ ఎలా ఉండబోతుంది? అన్నది చూడాలి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: China is looking to be the most powerful country in the world
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com