బార్డర్‌లో చైనాతో ఇంకా సమరం ముగియనేలేదు. ఏదో ఒక కవ్వింపు చర్యలతో ఇంకా భారత సైన్యాన్ని రెచ్చగొడుతూనే ఉంది. మరోసారి దాని కుట్రలు వెలుగులోకి వచ్చాయి. హిందూ మహాసముద్రంలో భారత ఆధిపత్యానికి సవాల్ విసిరేలా కొత్త ఎత్తుగడలు వేస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా ఈ సాగరంలో జలాంతర డ్రోన్లను భారీగా మోహరించింది.
Also Read: ‘తలైవా’ ఇంటి ముందు టెన్షన్.. టెన్షన్..!
‘సీ వింగ్’ అనే ఈ సాధనలు నెలల తరబడి రహస్యంగా కార్యకలాపాలు సాగించగలవు. ప్రత్యర్థి యుద్ధనౌకల కదలికలపై సమాచారాన్ని సేకరించేందుకు ఇవి ఉపయోగపడుతాయని రక్షణ విశ్లేషకుడు హెచ్‌ఐ సట్టన్ తెలిపారు. ఈ డ్రోన్ ఒకరకమైన మానవరహిత వాహనం. వీటిని 2019 డిసెంబర్‌లో చైనా రంగంలోకి దింపింది. దాదాపు 3400 పరిశీలనలు చేపట్టాక ఫిబ్రవరిలో వాటిని వెలికి తీసింది. గతంలో అమెరికా నౌకాదళం లిట్టోరల్ బ్యాటిల్‌స్పేస్ సెన్సింగ్–గ్లైడర్ అనే డ్రోన్‌ను దక్షిణ చైనా సముద్రంలో మోహరించింది. దీన్ని 2016 డిసెంబర్ 15న చైనా స్వాధీనం చేసుకుంది. వివాదం ముదరడంతో అమెరికాకు తిరిగి అప్పగించింది.
అలాంటి సాధనాన్నే చైనా తయారు చేయడం గమనార్హం. ‘రివర్స్ ఇంజినీరింగ్’ పద్ధతిలో ఇతర దేశాల ఆయుధాలను, సామగ్రిని కాపీ కొట్టగల నేర్పరి చైనా. ఇది అందరికీ తెలిసిన విషయమే. ‘సీ వింగ్’ నడవడానికి ఎలాంటి యంత్రాలు అవసరం లేదు. భారీ రెక్కల సాయంతో అది గ్లైడ్‌లా కదులుతుంటుంది. ఇందులో బెలూన్‌లాంటి సాధనం ఉంటుంది. అందులో ఉండే పీడనంతో కూడిన ఆయిల్‌తో ఇది ఉబ్బెత్తుగా మారుతుంది. ఫలితంగా ఈ డ్రోన్ నీటి కిందకు వెళ్లిపోతుంది. కొద్ది సేపటి తర్వాత బెలూన్‌లోని ఆయిల్ బయటకు వెళ్లిపోతుంది. ఫలితంగా డ్రోన్ నీటిపైకి వస్తుంది. దీనికి తోక భాగంలో యాంటెన్నా ఉంటుంది. దీని సాయంతోనే చైనా యుద్ధనౌకలకు సమాచారాన్ని చేరవేస్తుంది.
Also Read: న్యూ ఇయర్ కు ఘన స్వాగతం.. ప్రపంచవ్యాప్తంగా అంబరాన్నంటిన సంబరాలు
ఇప్పుడు హిందూ మహాసముద్రంలో సీ వింగ్‌లను పెద్ద సంఖ్యలో దింపింది చైనా. అక్కడ 14 డ్రోన్లను మోహరించాలని డ్రాగన్ టార్గెట్. కానీ.. 12 డ్రోన్లను దింపింది. సముద్ర పరిశీలనకు వీటిని దించుతున్నట్లు చైనా చెబుతోంది. కానీ.. హిందూ మహాసముద్రంపై పట్టు బిగించేందుకు అనేక దేశాల మధ్య పోటీ నెలకొన్నట్లు భారత త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ ఇటీవల ఒక సదస్సులో తెలిపారు.
మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు