Children’s Day 2025: పిల్లలు.. దేవుడు చల్లనివారే.. కల్లాకపటం ఎరుగని కరుణామయులే. . చిన్నారుల గురించి.. వారి మనసు గురించి ఓ కవి రాసిన మాటలు ఇవి. ఈ మాటలు చాలు చిన్నారుల మనస్తత్వాన్ని చెప్పడానికి. లోకం పోకడ తెలియదు.. మంచికి చెడుకు వ్యత్యాసం తెలియదు. ఇటువంటి పరిస్థితుల మధ్య చిన్నారులు పెరుగుతుంటారు. ముద్దు ముచ్చట్లతో.. అల్లరి చేష్టలతో ఆనందమైన జీవితాన్ని గడుపుతుంటారు. ఆకలేస్తే ఏడుస్తారు. నిద్ర వస్తే పడుకుంటారు. సంతోషం కలిగితే కడుపునిండా నవ్వుతుంటారు. ఇలా ప్రతి భావనను వారు వ్యక్తం చేస్తూనే ఉంటారు. అందుకే శైశవం ఆనందదాయకం అంటారు పెద్దలు.
మనదేశంలో బాలల దినోత్సవాన్ని ప్రతి ఏడాది నవంబర్ 14న నిర్వహిస్తుంటారు. మాజీ ప్రధానమంత్రి నెహ్రూ చిన్నపిల్లలపై చూపించిన ప్రేమ, వారి విద్య కోసం చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది నవంబర్ 14న బాలల దినోత్సవం నిర్వహిస్తారు. ఈ రోజున చిన్న పిల్లలు చాచా నెహ్రూ చేసిన సేవలను గుర్తు చేసుకుంటారు. పాఠశాలలో నిర్వహించే వేడుకలలో డ్యాన్సులు వేస్తుంటారు. ఇతర సాంస్కృతిక కార్యక్రమాలలో భాగస్వాములవుతుంటారు. చిన్నపిల్లలకు మిఠాయిలు.. ఇతర కానుకలను పాఠశాలల నిర్వాహకులు అందజేస్తుంటారు.
వాస్తవానికి మనదేశంలో నవంబర్ 14న బాలల దినోత్సవం నిర్వహించేవారు కాదు. గతంలో ఐక్యరాజ్యసమితి నవంబర్ 20న చిన్నారుల దినోత్సవం జరుపుకోవాలని ఆదేశించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 20న చిన్నారుల దినోత్సవం జరుపుకునేవారు. అయితే 1964లో నెహ్రూ చనిపోయిన తర్వాత.. ఆయనకు నివాళిగా మనదేశంలో చిన్నారుల దినోత్సవాన్ని నవంబర్ 14 వ తేదీకి మార్చారు. పిల్లల హక్కులు, విద్య, అభివృద్ధి, సమానత్వం, రక్షణ పై అవగాహన పెంపొందించడానికి ఈ దినోత్సవాన్ని మనదేశంలో నిర్వహిస్తున్నారు.. చిన్నపిల్లలు ఆనందంగా తమ జీవితాన్ని గడపాలని.. ఒక నిర్ణీత వయసులో వారు స్కూలుకు వెళ్లాలని.. వెట్టి చాకిరీ చేయకూడదని.. పనికి వెళ్లకూడదని.. చిట్టి చేతులు పలకాబలపం పట్టాలనేది బాలల దినోత్సవం ఉద్దేశం.
బాలల దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు జరుగుతుంటాయి. ఈ రోజున ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో చిన్నారులకు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తుంటారు. నెహ్రూ చిన్నారుల కోసం చేసిన త్యాగాన్ని వివరిస్తుంటారు. విద్యార్థులతో రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి.. అందులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందిస్తుంటారు..