Cheekoti Praveen : సంక్రాంతి అంటే… మిగతా ప్రాంతాల్లో ఎలా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కోడిపందాలు జోరుగా సాగుతుంటాయి. కోట్లలో బెట్టింగులు నడుస్తాయి.. భీమవరం నుంచి తణుకు దాకా ఇదే పరిస్థితి.. రాజకీయ నాయకుల ప్రమేయం ఉండడంతో పోలీసులు అడ్డుకోలేని పరిస్థితి.. వాస్తవంగా నిన్న మొన్నటి దాకా ఇందులో రాజకీయ కోణం కొంతవరకే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కోడిపందాలే కాకుండా రకరకాల జూదాలు కూడా నిర్వహిస్తున్నారు. గత ఏడాది గుడివాడ నియోజకవర్గంలో ఏకంగా కాసినో లాంటి జూదాలు నిర్వహించి అధికార పార్టీ నాయకులు కోట్లలో దండుకున్నారు.

ప్రవీణ్ మకాం అక్కడే
చికోటి ప్రవీణ్… కొన్ని నెలల క్రితం కాసినో వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి. అయితే ఈయన దందాలో ఇరు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు ఉండడంతో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో ఏపీలో కోడిపందాలు జరుగుతున్న నేపథ్యంలో సంక్రాంతి ముగిసేంతవరకు ప్రవీణ్ అక్కడే మకాం వేయనున్నట్లు సమాచారం.. ఇటీవల ప్రవీణ్ ఫామ్ హౌస్ ను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సందర్శించారు.. అక్కడ పెరుగుతున్న వివిధ రకాల జంతువులను పరిశీలించారు.. అది జరిగిన కొద్ది రోజులకే ప్రవీణ్ ఆంధ్రప్రదేశ్ రావడం గమనార్హం.. ఆయన రాకకు కోడిపందాలు కారణమని చెబుతున్నప్పటికీ తెర వెనుక వేరే వ్యవహారం ఉంటుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి..
సంక్రాంతి కోడిపందాల్లో పాల్గొనేందుకు ప్రవీణ్ ఏపీ వెళ్లారు.. ముందుగా విజయవాడలోని కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నారు.. అనంతరం మీడియాతో మాట్లాడారు.. తాను నిర్వహించే కేసీనో ఎవరెవరు ఆడారో అందరి పేర్లు త్వరలోనే బయటపెడతానని ఒక హెచ్చరిక జారీ చేశారు.. అంతేకాదు పండుగ ముగిసేంత వరకు కూడా తాను ఏపీలో ఉంటానని చెప్పుకొచ్చారు.. ఈసారి గత ఏడాది గుడివాడలో నిర్వహించినట్టు గన్నవరం నియోజకవర్గంలో కేసినో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు ప్రచారం సాగుతోంది.. ఈసారి కోడిపందాలే కాకుండా వివిధ రకాలైన జూద క్రీడలు నిర్వహిస్తామని నిర్వాహకులు బాహాటంగానే చెబుతున్నారు.. ఇందులో ప్రవీణ్ పాత్ర ఏంటనేది తేలాల్సి ఉంది.
ప్రవీణ్ కోడిపందాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టడంతో కలకలం రేగుతోంది.. ప్రవీణ్ తెర వెనుక ఉండి పలు ప్రాంతాల్లో కేసినో నిర్వహించేందుకే ఏపీలో అడుగు పెట్టారని పలువురు అంటున్నారు. ప్రవీణ్ కు అధికార పార్టీ నాయకుల అండదండలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. గత ఏడాది గుడివాడ కేంద్రంగా నిర్వహించిన కేసీనోలో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. అప్పట్లో ఆ వ్యవహారాన్ని ప్రవీణ్ నడిపాడు. ఇప్పుడు కూడా అదే తంతు కొనసాగించేందుకు ఏపీ వచ్చాడని తెలుస్తోంది.. ఎలాగూ అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండడంతో ఈసారి దందా మరింత జోరుగా సాగే అవకాశాలు ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.