Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవిత.. పరిచయం అక్కరలేని పేరు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముద్దుల తనయ.. మాజీ ముఖ్యమైన మంత్రి కల్వకుట్ల తారక రామారావు చెల్లి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక నిందితురాలు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ బహిష్కృత నేత. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు. పార్టీలోనే ఉంటూ కేసీఆర్‌కు పార్టీ వ్యవహారాలపై బహిరంగ లేఖ రాయడం.. హరీశ్‌రావు, సంతోష్‌రావు వంటి నేతలపై ఆరోపణలు చేయడంతో పార్టీ నుంచి కవితను వెళ్లగొట్టారు. ఇప్పుడు ఆమె ఒంటరి. తన జాగృతి సంస్థను చూసుకుంటున్నారు. ఈ జాగృతి పేరుతోనే ఇటీవల జనం బాటకు శ్రీకారం చుట్టారు. కానీ.. ఆమె చేస్తున్న యాత్రలో జనం మాత్రం కనిపించడం లేదు.
ప్రజల వద్దకు వెళ్లాలని..
బీఆర్‌ఎస్ నుంచి బహిష్కరించిన తర్వాత ఆమె ‘జనం బాట‘ పేరిట జిల్లాల పర్యటన చేస్తున్నారు. ప్రజల మధ్యకు వెళ్లి గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఆమె పర్యటనలో సాధారణ ప్రజలు పెద్ద ఎత్తున కనిపించటం లేదు. జనం కన్నా ఆమె ఫాలోవర్స్, అనుచరులే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇక ఈ పర్యటనలో కవిత మహిళల, రైతుల దగ్గర సందడి చేసి వారి సమస్యలు తెలుసుకోవడం, సాయంత్రం యువతను, ఇతర శ్రేణులని సమావేశాలు పూర్తి చేసి వచ్చి వారికి మందు, విందు పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు.
లక్ష్యం ఏమిటో…
కవిత జనం బాట లక్ష్యం ఏమిటన్నది ఆమె వెంట వెళ్లేవారికి గానీ, ఆమె కలుస్తున్నవారికి గానీ అర్థం కావడం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు. ఆమె పార్టీ పెట్టలేదు. తనను పార్టీ నుండి తొలగించారని ప్రకటించాలని, లేదా కొత్త రాజకీయ ప్రయాణం మొదలుపెట్టాలని కావిత యాత్రతో చెప్పాలనుకుంటోంది అనేది ప్రచారాల్లో ఉంది. కానీ ఈ విషయంపైనా కవిత స్పష్టత ఇవ్వడం లేదు. కేవలం హరీశ్‌రావును విమర్శించడమే లక్ష్యంగా యాత్ర సాగిస్తున్నారు. పది ఉమ్మడి జిల్లాల్లో యాత్ర పూర్తయింది. ఇప్పుడు గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొద్దోగొప్పు స్పందన కనిపించింది. గ్రేటర్ జిల్లాలో ఆమాత్రం స్పందన కూడా ఉండడం లేదు.
బీఆర్‌ఎస్ నేతల విమర్శలు..
కవిత యాత్రపై బీఆర్‌ఎస్ నేతలు ‘పార్టీ వీరోధి‘, ‘ద్రోహం చేశావు‘ వంటి ఆక్షేపణలు చేస్తూ కవితపై విమర్శలు చేస్తున్నారు. పార్టీ లోపల ఉన్న జనాభావాల కారణంగా ఆమె యాత్ర పెద్ద స్పందన పొందలేదని భావిస్తున్నారు. మరోవైపు కవితకు ప్రస్తుతం మీడియా ద్వారా పెద్ద కవరేజీ లభించడం లేదు. గతంలో బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు ‘నమస్తే తెలంగాణ‘, ‘సాక్షి‘ లాంటి పత్రికల్లో ప్రాధాన్యంగా వార్తలు వెలువడేవి, కానీ ఇప్పుడు జిల్లా పేజీలలో చిన్న ఫోటోలు పెట్టి కవిత వార్తను ఏదో ఒక మూలన ప్రచురిస్తున్నారు. దీంతో ఆమె సోషల్ మీడియానే ఎక్కువగా నమ్ముకున్నట్లు కనిపిస్తోంది.
మొత్తంగా కవిత పర్యటన యథార్థ గమ్యం, సామాజిక–రాజకీయ ప్రయోజనాలు ఇంకా అర్ధం కావడం ఇంకా స్పష్టంగా లేదని చెప్పవచ్చు. ఆమె నాయకత్వ యాత్ర కొనసాగితే, జనసమ్మతి, మద్దతు ఎలా మారిపోతుందో చూడవలసి ఉంటుంది.