Bandi Sanjay: అధ్యక్ష బాధ్యతల నుంచి బండి అవుట్.. గుహవాటికి ఈటెల.. బీజేపీలో ఏం జరుగుతోంది?!

బండి సంజయ్‌ కి కేంద్రంలో సహాయ మంత్రి పదవి ఇచ్చి.. డీకే అరుణకు పార్టీ అధ్యక్ష పదవి.. ఈటలకు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌ పదవి

Written By: Bhaskar, Updated On : June 10, 2023 7:17 pm
Follow us on

Bandi Sanjay: తెలంగాణలో బీఆర్‌ఎస్ ను ఎదుర్కొనేందుకు అవలంబించాల్సిన వ్యూహంపై గత కొద్ది నెలలుగా ఢిల్లీ బీజేపీ అగ్రనేతలతో జరుగుతున్న చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. బండి సంజయ్‌ను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించి.. బయటి నుంచి వచ్చిన ఈటల రాజేందర్‌, డీకేఅరుణ వంటి నేతలకు పార్టీ సారథ్యం అప్పగించి ఎన్నికల బరిలో ఉధృతంగా దిగితేనే రాష్ట్రంలో బీఆర్‌ఎస్ కు బీజేపీ గట్టి పోటీ ఇవ్వగలుగుతుందనే అభిప్రాయానికి పార్టీ అధిష్టానం వచ్చింది. ఇదే సమయంలో పార్టీని మరింత బలోపేతం చేసే విషయం మీద దృష్టి సారించింది. భారత రాష్ట్ర సమితిని నిలువరించాలంటే ప్రస్తుతం ఉన్న బలం సరిపోదని గుర్తించింది. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత విస్తృతం చేయాలంటే భారత రాష్ట్ర సమితిని తెలివిగా టాకిల్ చేసే నాయకుడు కావాలని గుర్తించింది. అయితే ప్రస్తుతం బండి సంజయ్ ని పార్టీ అధ్యక్ష స్థానం నుంచి తప్పించి, కేంద్ర మంత్రివర్గంలోకి ఆయనను తీసుకోవాలని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి

ఈమేరకు.. బండి సంజయ్‌ కి కేంద్రంలో సహాయ మంత్రి పదవి ఇచ్చి.. డీకే అరుణకు పార్టీ అధ్యక్ష పదవి.. ఈటలకు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌ పదవితోపాటు ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక అధికారాలు ఇవ్వాలన్న ప్రతిపాదనపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, సంయుక్త ప్రధాన కార్యదర్శి సౌదాన్‌ సింగ్‌ తదితరులు కీలక చర్చలు జరిపినప్పుడు తెలంగాణ గురించి ప్రత్యేక వ్యూహరచన చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణకు సంబంధించిన ఎన్నికల వ్యూహరచనలో.. అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని.. ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలో ఈటలకే పార్టీ తరఫున కీలక బాధ్యతలు అప్పగించాల్సిందిగా ఆయనే అధిష్ఠానానికి సూచించారని తెలుస్తోంది. ఈటల రాజేందర్‌ కూడా శుక్రవారం అసోం రాజధాని గువాహటికి చేరుకుని హిమంతతో రహస్య మంతనాలు జరిపారు. నిజానికి ఆయన ఢిల్లీకి వెళ్తున్నట్టు ప్రచారం జరిగినప్పటికీ.. ఆయన గువాహటికి వెళ్లినట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

చర్చలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత..

అధిష్ఠానం చర్చలు ఒక కొలిక్కి వచ్చిన నేపథ్యంలో.. తెలంగాణలో నాయకత్వ మార్పులకు సంబంధించి ఏ క్షణమైనా కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. అలాగే.. నాయకత్వ మార్పులు జరిగితే పార్టీ నిలదొక్కుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి.. తెలంగాణ ఎన్నికలు జనవరి మొదటివారంలో జరిపే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికలు 2018 డిసెంబరులోనే జరిగినప్పటికీ.. కేసీఆర్‌తో సహా ఎమ్మెల్యేలంతా 2019 జనవరి 17న ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి, జనవరి 16లోపు ఎన్నికల ఘట్టం ముగించేందుకు అవకాశం ఉన్నదని రాజ్యాంగ నిపుణులు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. అలా జనవరిలో ఎన్నికలు జరిపితే..ఈటల బృందానికి ఎన్నికల వ్యూహాలను అమలు చేయడానికి నెల సమయం అదనంగా లభిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

మూడు ప్రతిపాదనలు..

తెలంగాణలో బీజేపీ విజయావకాశాలను మెరుగుపరిచేందుకు అధిష్ఠానం 3 ఫార్ములాలను పరిశీలించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 1. బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్షుడుగా కొనసాగిస్తూనే ఈటలకు పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ సారథ్యంతో పాటు అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషించేందుకు వీలు కల్పించడం.

2. పార్టీ వ్యవహారాలను, ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌ బాధ్యతలు.. రెండింటినీ బయటి నుంచి వచ్చిన నేతలకే అప్పగించి, పార్టీని గెలుపు దిశగా తీసుకువెళ్లేందుకు పూర్తి అధికారాలు వారికే ఇవ్వడం. ఇందులో భాగంగానే.. పార్టీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు పార్టీ అధ్యక్ష పదవిని, ఈటల రాజేందర్‌కు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌ బాధ్యతను అప్పగించే ప్రతిపాదన వచ్చింది.

3. పార్టీ అధ్యక్ష పదవిని ఈటల రాజేందర్‌కే అప్పగించి, ఎన్నికల కమిటీలను నియమించే స్వేచ్ఛ ఆయనకే కల్పించడం.
అయితే, డీకే అరుణకు పార్టీ అధ్యక్షురాలి పదవి, ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్‌ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఏది ఏమైనా మూడు ఫార్ములాల్లో ఈటలకే రాష్ట్ర బీజేపీలో అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, అభ్యర్థుల ఎంపికలో ఆయనకే స్వేచ్ఛ ఇవ్వాలని బీజేపీ అఽధిష్ఠానం నిర్ణయించినట్లు అర్థమవుతోంది. కేసీఆర్‌ను వ్యూహాల గురించి బాగా తెలిసిన వ్యక్తి కావడం వల్ల.. ఈటల ఆయన్ను బలంగా ఢీకొనేలా పదునైన వ్యూహరచన చేయగలుగుతారని భావించడమే ఇందుకు కారణం. ఈక్రమంలోనే.. 2013లో మోదీని ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించి, ఆయననే ప్రధాని అభ్యర్థిగా రంగంలోకి దించినట్లు.. ఈటలను కూడా ప్రచార కమిటీ చైర్మన్‌గా రంగంలోకి దించి, ఆయనకే సీఎం అయ్యే అవకాశాలు కల్పించాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు ఒక వర్గం చెబుతోంది.