Chandrababu: ఏపీలో విపక్ష నేతలను టార్గెట్ గా చేసుకొని వరుసగా జరుగుతున్న దాడులపై కేంద్ర నిఘా, దర్యాప్తు, భద్రతా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విపక్ష నేతల పర్యటనల సమయంలో రెచ్చగొట్టడం, కవ్వింపు చర్యలకు పాల్పడడం, పువ్వుల మధ్య రాళ్లు వేయడం వంటి చర్యలపై విస్మయం వ్యక్తం చేస్తున్నాయి, ప్రధానంగా ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు భద్రతపై నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ప్రత్యేకంగా పోకస్ పెంచింది. పదేపదే రివ్యూలు చేస్తోంది. ఇటీవలే భద్రతను పెంచింది. కమెండోల సంఖ్యను రెండింతలు చేసింది. అయినా చంద్రబాబు పర్యటనల్లో వైసీపీ అల్లరిమూకల అలజడులు తగ్గకపోవడంతో ఆందోళన చెందుతోంది. అటు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటనను సైతం అడ్డుకొని విధ్వంసం సృష్టించేందుకు వెనుకాడడం లేదు. మొన్నటికి మొన్న కృష్ణా జిల్లాలో చంద్రబాబు పూల మధ్య రాయి ఒకటి దూసుకొచ్చింది. దీనిపై ఎన్ఎస్జీ ఉన్నతాధికారులకు నివేదిక వెళ్లినట్టు తెలుస్తోంది.

ఏపీలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితులను గుర్తించిన ఎన్ఎస్జీ అధికారులు పోలీస్ శాఖ వ్యవహరిస్తున్న తీరును కూడా తప్పుపట్టినట్టు తెలుస్తోంది. జెడ్ ప్లస్ కెటగిరీ ఉన్న నాయకుడిపై దాడికి ప్రయత్నిస్తే ఏపీ పోలీసులు కనీసం కేసు నమోదుచేయలేదు. స్థానిక టీడీపీ నాయకులు సీసీ పుటేజీలతో పాటు సాక్షాధారాలతో వివరాలు అందించినా పోలీసులు చర్యలకు వెనుకడుగు వేశారు.ఎవరు దాడికి పాల్పడ్డారో తెలిసినా సైలెంట్ గా ఉండిపోయారే తప్ప యాక్షన్ లోకి దిగలేదు. వీటిన్నింటిపై రివ్యూ చేసిన నేషనల్ సెక్యూరిటీ గార్డు చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎన్నికల ఏడాది కావడంతో.. చంద్రబాబు ప్రజల మధ్య ఉండే అవకాశముంది. ఏ చిన్నపాటి నిర్లక్ష్యం వహించినా భారీ మూల్యం తప్పదని భావిస్తున్నట్టు సమాచారం.
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న హింసాత్మక ఘటనలు, వైసీపీ విధ్వంసకర చర్యలను పసిగట్టిన నిఘా సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి నివేదించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ రివ్యూ జరిపినట్టు సమాచారం. రాజకీయ ప్రత్యర్థులను అంతమొందించేందుకు కూడా వెనుకాడని పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయని.. ప్రధానంగా పొలిటికల్ గా అధికార పార్టీ దూకుడు విధ్వంసాలకు కారణమని కేంద్రం వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. అందుకే భద్రతా విభాగాలకు స్పష్టమైన ఆదేశాలొచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఎన్ఎస్జీ చంద్రబాబు భద్రతపై ప్రత్యేకంగా ఫోకస్ పెంచింది.

ప్రస్తుతం చంద్రబాబు జిల్లాల టూర్లు మొదలుపెట్టారు. ఎన్నికలకు చివరి ఏడాది కావడంతో ఆయన పర్యటనలు విస్తృతం చేస్తారు. నిత్యం ప్రజల మధ్య ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో ఆయన భద్రత నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ విభాగానికి కత్తిమీద సాములా మారింది. అందుకే చంద్రబాబు మాట్లాడే డయాస్ ముందు ఒక వలయాన్ని తయారుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏపీలో ఉన్న ప్రత్యేక పరిస్థితులతో కమెండోలు అనునిత్యం జాగ్రత్తగా ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు సమాచారం. అయితే ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీ దుందుడుకు చర్యలు జాతీయ స్థాయిలో ఏపీ చరిత్రను మసకబారుస్తోంది. నవ్వులపాలు చేస్తోంది.