Chandrababu Vs Jagan: చంద్రబాబు తర్వాత ఎవరు? లోకేషా? రామోజీరావా? నెక్స్ట్ అరెస్టు ఎవరిది? అంటే అందరి చూపు లోకేష్ వైపే కనిపించింది. ఆ మధ్యన లండన్ పర్యటన ముగించుకుని ఏపీకి చేరుకున్న సీఎం జగన్ సిఐడి ముఖ్యులతో పాటు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. లోకేష్ ను ఎందుకు విడిచి పెట్టారు అని ప్రశ్నించారు. రామోజీరావు, దేవినేని ఉమా, కొలికిపూడి శ్రీనివాసరావు వంటి వారిని టార్గెట్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అయితే అంతటితో ఆ జాబితా ఆగలేదని.. నారా భువనేశ్వరి, బ్రాహ్మణిల పై సైతం కేసులు నమోదు చేయాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
తనను అవినీతిపరుడుగా ముద్ర వేయడంలో చంద్రబాబు పాత్ర అధికమని ఏపీ సీఎం జగన్ అనుమానిస్తున్నారు. తనను అన్యాయంగా కేసుల్లో ఇరికించి పైశాచిక ఆనందం పొందుతున్న ప్రతి ఒక్కరి అంతు చూడడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. తనపై గోబెల్స్ ప్రచారం చేయడంలో ముందున్న రామోజీరావు తో పాటు తన కేసుల్లో ప్రమేయం ఉన్న కుటుంబాలను సైతం జగన్ విడిచిపెట్టలేదు. నాడు తనపై కేసులు వేయడంలో కీలక పాత్ర పోషించిన కింజరాపు ఎర్రన్నాయుడు కుటుంబాన్ని సైతం జగన్ వెంటాడిన సంగతి తెలిసిందే. ఎర్రన్న సోదరుడు అచ్చెనాయుడుని ఎలా టార్గెట్ చేశారో అందరికీ తెలిసిన విషయమే. తాజాగా చంద్రబాబు పై పడ్డారు. ఒక్క చంద్రబాబుతో సరిపెట్టడం లేదు. ఆయన కుమారుడు తో పాటు కుటుంబ సభ్యులపై సైతం కేసులు నమోదు చేయించాలన్న కృత నిశ్చయంతో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాజకీయ లాభనష్టాలను పరిగణలోకి తీసుకోకపోవడం విశేషం.
చంద్రబాబు ఊహకందని రీతిలో ఆయనపై కేసులు నమోదు చేశారు. జైలులో పెట్టారు. మూడు వారాలకు పైగా రిమాండ్ విధించగలిగారు. రేపో మాపో లోకేష్ ను సైతం అరెస్టు చేస్తామని సంకేతాలు ఇస్తున్నారు. అయితే దీనికే ఎల్లో మీడియా రంకెలు వేస్తోంది. ఈ తరుణంలో మరో వార్త హల్చల్ చేస్తోంది. నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలపై సైతం కేసులు నమోదు చేసేందుకు సిఐడి పగడ్బంది వ్యూహం రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందుకుగాను భారీగానే కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ఆ ఇద్దరిపై పట్టు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో నారా లోకేష్ ను 14వ నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే.
ఇన్నర్ రింగ్ రోడ్డు ఏర్పాటులో హెరిటేజ్ సంస్థకు భారీగా లబ్ధి చేకూర్చినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. అందుకు తగ్గట్టుగానే ఈ కేసులో హెరిటేజ్ ఫుడ్ సంస్థను చేర్చడం వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హెరిటేజ్ ఫుడ్ సంస్థలో బ్రాహ్మణి, భువనేశ్వరి కీలక హోదాల్లో ఉన్నారు. లోకేష్ కేవలం డైరెక్టర్ మాత్రమే. కానీ లోకేష్ భార్య బ్రాహ్మణి, తల్లి భువనేశ్వరి మేనేజ్మెంట్ హోదాలో ఉన్న విషయం విధితమే. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో హెరిటేజ్ భారీ లబ్ధి పొందిందని సిఐడి చెప్పడం వెనుక ప్రత్యేక ఎత్తుగడ ఉన్నట్లు తెలుస్తోంది. బ్రాహ్మణి, భువనేశ్వరి లను అవినీతిలో భాగస్వామ్యం చేసేందుకేనని టాక్ నడుస్తోంది. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, భార్య భువనేశ్వరి.. ఇలా కుటుంబమంతా అవినీతికి పాల్పడిందని చూపడమే జగన్ లక్ష్యంగా తెలుస్తోంది.